22-03-2025 05:41:04 PM
స్కానింగ్ సెంటర్లో రికార్డు పకడ్బందీగా నిర్వహించాలి..
స్కానింగ్ కేంద్రాలను తరచు పర్యవేక్షించాలి..
జిల్లా జడ్జి వరప్రసాద్, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పి.సి.పి.ఎన్.డి.టి. (గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షా) చట్టం అమలు కోసం జిల్లా మల్టి మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. సమావేశంలో జిల్లా జడ్జి వర ప్రసాద్ మాట్లాడుతూ.... స్కానింగ్ కేంద్రాల్లో రికార్డు లు, రిజిష్టర్ ల నిర్వహణ పకడ్బందీగా ఉండేటట్లు చూడాలి. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షా చట్టంలో గల నిబంధనలు అమలు జరిగేలా పర్యవేక్షించాలి. ఈ చట్టంలోని నిబంధనలు పాటించని స్కానింగ్ కేంద్రాల పట్ల కఠిన వైఖరితో తగు చర్యలు చేపట్టాలని సూచించారు.
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ... స్కానింగ్ కేంద్రాలను తరచుగా వైద్య శాఖ అధికారులు తనిఖీలు చేస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ కేంద్రాలపై తీవ్రమైన చర్యలు చేపట్టాలని, నిబంధనలు పాటించని కేంద్రాల గుర్తింపు రద్దు చేయాలని సూచించారు. అనంతరం జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ నిబంధనలు పాటించని ఆసుపత్రులకు అనుమతులు మంజూరు చేయకూడదు, ఏవైనా ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ లేకుండా ఉంటే వెంటనే వారికి నోటీసులు జారీ చేయాలని తెలిపారు.
ఆర్.ఎం.పి. వైద్యుల పట్ల నిఘా పెంచి అర్హత లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హత గల వైద్యులు రాసిన మందులనే మెడికల్ షాప్ లలో ఇవ్వాలని మందుల చీటీ లేకుండా మందులు ఇస్తున్న మెడికల్ షాప్ ల పైన చర్యల కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని ఆసుపత్రుల పైన స్కానింగ్ కేంద్రాల పైన చట్ట రీత్యా చర్య ల కోసం అవసరమైతే కేసులు పెట్టాలి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కోర్టు జడ్జి వర ప్రసాద్ అడిషనల్ ఎస్.పి. వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు డా.శిరీష, డా.విద్య, డా.ప్రభు కిరణ్, ఇండియన్ మెడికల్ అసోసియేహన్ కార్యదర్శి డా.అరవింద్, ఇంచార్జి డెమో వేణుగోపాల్, ఆరోగ్య విస్తీరణ అధికారి చలపతి ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.