కామారెడ్డి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): జిల్లాకేంద్రంలో వైద్యాధికారులు, సిబ్బంది లింగ నిర్ధారణ పరీక్ష చేసే యంత్రాన్ని పట్టుకున్నారు. వరుస ఘటనలు ఇలా.. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తండ్రీకొడుకులు వైద్యులు. వారు అనధికారికంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ గతేడాది పట్టుబడ్డారు. ఎలాగోలా బయటకు వచ్చారు. ఆరునెలల క్రితం కుమారుడు మరో ప్రైవేట్ ఆసుపత్రి తెరిచాడు.
కుమారుడు ఇటీవల ఓ మహిళకు గర్భస్రావం చేసి, ఆమె కుటుంబం నుంచి రూ.80 వేలు తీసుకున్నాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. తిరిగి అదే ఆసుపత్రిలో పనిచేసిన బల్ల రవి అనే వ్యక్తి రాజంపేట మండల కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా.. రవిని అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో వైద్యాధికారులకు లింగ నిర్ధారణ యంత్రం పట్టుబడింది. నిందితులు ఓ వాహనంలో యంత్రాన్ని తరలిస్తుండగా పట్టుబడింది. కొందరు ముఠాగా ఏర్పడి ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం.