calender_icon.png 3 April, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ బందోబస్తు మధ్య జెన్కో సిఎండి పర్యటన

01-04-2025 10:56:47 PM

ఏఎంఆర్ బొగ్గు వెలికితీత, మట్టి డంపింగ్ పనుల పరిశీలన..

డేంజర్ జోన్ భూ నిర్వాసితుల కు న్యాయం చేస్తాం..

జెన్ కో సిఎండి సందీప్ కుమార్ సుల్తానియా..

కాటారం/మలహర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ మండలం తాడిచర్ల ప్రాంతంలో మంగళవారం భారీ బందోబస్తు మధ్య జెన్ కో సీఎండి సందీప్ కుమార్ సుల్తానియా పర్యటించారు. ఏ ఎమ్మార్ ప్రైవేట్ సంస్థ చేపడుతున్న బొగ్గు వెలికితీత పనులను, మట్టి డంపింగ్ ప్రదేశాలను పరిశీలించారు. తాడిచర్ల ఉపరితల గని బ్లాక్ వన్ ప్రాజెక్టులో ముంపునకు గురైన డేంజర్ జోన్ భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. త్వరలోనే భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు లబ్ధి చేకూరుస్తామని పేర్కొన్నారు. ఏఎంఆర్ ప్రైవేట్ సంస్థ యాజమాన్యం, జెన్ కో అధికారులు, రెవెన్యూ యంత్రాంగంతో రహస్యంగా సమావేశాన్ని నిర్వహించారు.

ప్రాజెక్టు పనితీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్మిక చట్టం ప్రకారంగా కార్మికులకు సదుపాయాలు, ఏర్పాట్లు ఉన్నాయా అని ఆరా తీసినట్లు సమాచారం. ఓసిపి ప్రాజెక్టు ప్రాంతంలో పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా మొక్కలు నాటుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏఎమ్మార్ యాజమాన్యం సీఎండి కి కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ఓపెన్ కాస్ట్ డంపింగ్ ఎత్తును 60 మీటర్ల నుంచి 90 మీటర్లకు పెంచాలని కోరినట్లు తెలిసింది. బొగ్గు తరలించే కన్వేయర్ బెల్టు పనులకు సహకరించాలని సిఎండిని కోరినట్లు తెలిసింది. జెన్ కో సీఎం డి సందీప్ కుమార్ సుల్తానియా వెంట జెన్ కో డైరెక్టర్ లక్ష్మయ్య, ఏజెంట్ జీవన్ కుమార్, జనరల్ మేనేజర్ మోహన్ రావు, కేటిపిపి సిఈ ప్రకాష్, ఏ ఎం ఆర్ ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ రెడ్డి, సీఈవో డిఎల్ఆర్కె ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్లు రాజు, శ్రీధర్, జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్,  భూపాలపల్లి ఆర్డీవో ఎన్ రవి, మల్హర్ మండలం తహసిల్దార్ రవికుమార్ పాల్గొన్నారు.

సిఎండి రాక సందర్భంగా పోలీస్ బలగాలతో మైనింగ్ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాటారం డిఎస్పి గడ్డం రామ్మోహన్ రెడ్డి, సిఐ నాగార్జున రావు, కొయ్యూరు ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో అదనంగా ఐదుగురు ఎస్సైలతో 100 మంది పోలీసు సిబ్బందిచే భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డేంజర్ జోన్ నిర్వాసితులు లోనికి రాకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు. కాగా  ఓసిపి ప్రాజెక్టు వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, తమను సురక్షిత ప్రాంతాలకు తరలించి న్యాయం చేకూర్చాలని భూనిర్వాసితులు కోరారు. సీఎండి పర్యటన ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.