- 99 శాతం బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయం
- సేల్స్‌ఫోర్స్ సర్వే
ముంబై, అక్టోబర్ 15: భవిష్యత్తులో వ్యాపార విజయానికి జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (జెన్ ఏఐ) కీలకమని 99 శాతం మంది భారతీయ వాణిజ్యవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే జెన్ ఏఐ అవలంబించడానికి యాక్సెస్‌బిలిటీ, గవర్నెన్స్ తదితర అవరోధాలు ఉన్నాయని వారు చెప్పారు.
దేశవ్యాప్తంగా వివిధ వాణిజ్య రంగాలకు చెందిన 300 మంది బిజినెస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌తో సేల్స్‌ఫోర్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ అభిప్రాయం వ్యక్తమయ్యింది. పెరుగుతున్న డిజిటల్ ప్రపంచంలో పోటీతత్వంతో కొనసాగాలంటే ఏఐ టెక్నాలజీలను ఇంటిగ్రేట్ చేయడం తప్పనిసరి అని వారు ఏకగ్రీవంగా అంగీకరించారు.
పెద్ద వాణిజ్య సంస్థలకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల్లో 60 శాతం మంది తాము జనరేటివ్ ఏఐ వ్యూహాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నామని, 32 శాతం మంది ఏఐను అభివృద్ధిపర్చే ప్రక్రియలో ఉన్నామని చెప్పారు. వచ్చే మూడేండ్లలో మానవ ప్రమేయం లేకుండా ఏఐ ద్వారా కనీసం ఒక టాస్క్‌ను పూర్తిచేయగలమని దాదాపు సర్వే లో పాల్గొన్న ప్రతినిధులు అందరూ విశ్వా సం వ్యక్తం చేశారు.
జెన్ ఏఐను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి యాక్సెస్‌బిలిటీ సమస్యలు ఉన్నాయని 38 శాతం మంది చెప్పగా, ఏఐ ద్వారా ఒనగూడే ఫలితాల ఖచ్చితత్వం అనుమానాల్ని 34 శాతం మంది వ్యక్తం చేశారు. కార్పొరేట్ పాలనాపరమైన వ్యవస్థ లేకపోవడం ఏఐ అమలుకు అడ్డంకిగా నిలుస్తుందని 30 శాతం మంది చెప్పారు.