calender_icon.png 22 March, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతం హైదరాబాద్ ఎంబీఏకు ప్రతిష్టాత్మక ఎన్ బీఏ అక్రిడిటేషన్

22-03-2025 12:01:10 AM

ప‌టాన్ చెరు,(విజ‌య‌క్రాంతి): హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శిగ‌లో మరో కలికితురాయి చేరింది. హైదరాబాద్ ప్రాంగణంలోని స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహిస్తున్న మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) కోర్సుకు ప్రతిష్టాత్మక నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ) న్యూఢిల్లీ మంజూరు చేసినట్టు విశ్వవిద్యాలయ వర్గాలు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఈ గుర్తింపు జూన్ 30, 2028 వరకు మూడేళ్ల పాటు అమలులో ఉంటుందని తెలిపారు. డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయ హోదాను 2007లో పొందిన తరువాత గీతం అందుకున్న మొదటి ఎన్ బీఏ అక్రిడిటేషన్ ఇదని, వర్సిటీ చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ గుర్తింపు విద్యా నైపుణ్యం, బిజినెస్ మేనేజ్ మెంట్ విద్యలో ఉన్నత ప్రమాణాల పట్ల సంస్థ యొక్క నిబద్ధతను చెబుతోందన్నారు. హైదరాబాద్ ప్రాంగణంలోని ఎంబీఏ అధ్యాపకులు, అక్రిడిటేషన్ బృందాలను ఐక్యూఏసీ, అక్రిడిటేషన్ అండ్ ర్యాంకింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్.రాజా ప్రభు, డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.మంజునాథాచారి హృదయపూర్వకంగా అభినందించారు. వారి అవిశ్రాంత కృషి, అంకితభావం ఈ గౌరవనీయమైన గుర్తింపును పొందడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలియజేశారు. ఈ విజయం పట్ల గీతం ఉన్నత నాయకత్వం తమ హర్షాన్ని వెలిబుచ్చింది. విద్యా నైపుణ్యం, నిరంతర అభివృద్ధి పట్ల అచంచలమైన నిబద్ధతను ఈ గుర్తింపు వెల్లడిస్తోందని ఉప కులపతి ప్రొఫెసర్ ఎర్రోల్ డిసౌజా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.గుణశేఖరన్, అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా తదితరులు అభిప్రాయపడినట్టు వివరించారు. బిజినెస్ మేనేజ్ మెంట్ విద్యలో ప్రముఖ సంస్థగా గీతం స్థానాన్ని ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తోందని, జ్జానం, నైపుణ్యాలు, ప్రపంచ దృక్పథాలతో కూడిన భవిష్యత్ వ్యాపార నాయకులను అభివృద్ధి చేయాలనే గీతం లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని  పేర్కొన్నారు.

గీతంలో ఉత్సాహభరితంగా ‘అంతర్జాతీయ సంతోష దినోత్సవం’

అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆనందాన్ని సృష్టించే (క్రాఫ్టింగ్ జాయ్) కార్యక్రమాన్ని గీతం విద్యార్థి విభాగం ఉడాన్ నిర్వహించింది. సృజనాత్మకత, చైతన్యంతో కూడిన ఉత్తేజకరమైన వేడుక కోసం విద్యార్థులను డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఒకచోట చేర్చింది. వేడుకలలో భాగంగా, ఫ్లాష్ డ్యాన్స్, బంకమట్టితో బొమ్మల తయారీతో పాటు పుస్తక పఠన కార్యక్రమాలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.