రెండేండ్ల కనిష్ఠానికి ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు n క్యూ2లో 5.4 శాతానికి తగ్గుదల
నిరుత్సాహకరం
‘జీడీపీ వృద్ధి అంకెలు నిరుత్సాహకరమని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. క్యూ2 డేటాతో నిరాశ కల్గించినప్పటికీ, పూర్తి ఆర్థిక సంవత్సరానికి 6.5 శాతం జీడీపీ లక్ష్యం ప్రమాదంలో లేదు’
ఆర్థిక సలహాదారు అనంత్ నాగేశ్వరన్
న్యూఢిల్లీ, నవంబర్ 29: భారత ఆర్థిక వ్యవస్థ క్యూ2లో కుదేలైపోయింది. ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, అంతర్జాతీయ సంస్థలు, స్వయానా రిజర్వ్‌బ్యాంక్ సైతం దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని వెల్లడించిన అంచనాలను కూడా అందుకోలేక రెండేండ్ల కనిష్ఠస్థాయికి పడిపోయింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో (జూలై జీడీపీ కేవలం 5.4 శాతమే వృద్ధి చెందింది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (2022 అక్టోబర్-డిసెంబర్) నమోదైన 4.3 శాతం వృద్ధి రేటు తర్వాత కనిష్ఠస్థాయి వృద్ధి ఇదే.
శుక్రవారం కేంద్ర గణాంకాల శాఖ (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన వివరాల ప్రకారం అధిక ద్రవ్యోల్బణం కారణంగా పట్టణాల్లో వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడం, తయారీ, మైనింగ్ రంగాలు పేలవమైన పనితీరును కనపర్చడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు జీడీపీ మందగమనానికి ప్రధాన కారణం.
క్యూ2లో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతానికి తగ్గుతుందని మెజారిటీ ఆర్థిక వేత్తలు అంచనా వేయగా, దానికంటే అతి తక్కువ వృద్ధి నమోదయ్యింది. రిజర్వ్‌బ్యాంక్ అయితే క్యూ2లో 7 శాతం వృద్ధిని అంచనా వేసింది. అంతక్రితం ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 6.7 శాతం వృద్ధి కనపర్చగా, నిరుడు క్యూ2లో 8.1 శాతం వృద్ధి రేటును సాధించింది.
ఎన్‌ఎస్‌వో తాజా గణాంకాల ప్రకారం క్యూ2లో భారత ఆర్థిక వ్యవస్థకు చేకూరిన వాస్తవ స్థూల విలువ (జీవీఏ) 5.6 శాతంగా ఉన్నది. క్యూ1లో కనపర్చిన 6.8 శాతంకంటే గణనీయంగా తగ్గింది.
అయినప్పటికీ ఈ వృద్ధి రేటు కూడా భారత్‌ను ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగానే నిలుపుతున్నది. ప్రపంచంలో అధిక వృద్ధి సాధించే చైనా జీడీపీ ఈ జూలై-సెప్టెంబర్‌లో 4.6 శాతం వృద్ధిచెందింది. యూఎస్ ఎకానమీ 2.8 శాతం వృద్ధి సాధించింది.
ద్వితీయార్థంలో కోలుకుంటుంది
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వృద్ధి రేటు క్రమేపీ కోలుకుంటుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు, విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వ వ్యయాలు పెరగడం, మెరుగైన పంట దిగుబడుల ఫలితం గా గ్రామీణ డిమాండ్ పెరగడం, నిర్మాణ రంగ కార్యకలాపాలు, సర్వీసుల జోరు ఆర్థికాభివృద్ధికి బాస టగా నిలుస్తాయని అంటున్నారు. అయితే రానున్న నెలల్లో ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్యోల్బణం ఒత్తిడులను అధిగమించి, వినియోగాన్ని పునరుద్ధరించడంపై వృద్ధి ఆధా రపడి ఉంటుందని వారు హెచ్చరించారు.
జీడీపీ @ రూ.44.10 లక్షల కోట్లు
వాస్తవ జీడీపీ (స్థిర ధరల ఆధారంగా జీడీపీ) ఈ క్యూ2లో రూ.44.10 లక్షల కోట్లు గా నమోదయ్యింది. నిరుడు క్యూ2లో ఇది రూ.41.86 లక్షల కోట్లు. ఈ అంకెల ప్రకారం తాజా త్రైమాసికంలో 5.4 శాతం వృద్ధి సాధించినట్లని ఎన్‌ఎస్‌వో ప్రకటన తెలిపింది.
నామినల్ జీడీపీ (ప్రస్తుత ధరల ప్రకా రం) రూ.76.60 లక్షల కోట్లుకాగా, 2023 ద్వితీయ త్రైమాసికంలో రూ. 70.90 లక్షల కోట్లు. ఈ లెక్కల ప్రకారం నామినల్ జీడీపీ 8 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్థం (ఏప్రిల్-సెప్టెంబర్)లో వాస్తవ జీడీపీ రూ.87.74 లక్షల కోట్లు (6 శాతం వృద్ధి కాగా, నామినల్ జీడీపీ రూ.153.91 లక్షల కోట్లు (8.9 శాతం వృద్ధి).
ఎకానమీకి ఏమయ్యింది?
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అధిక ద్రవ్యోల్బణం వృద్ధికి విఘాతంగా పరిణమించిందని, ఆహారోత్పత్తుల గరిష్ఠ ధరలు, అధిక వడ్డీ వ్యయాలు, వేతనాల పెరుగుదల అంతంతమాత్రంగా ఉండటంతో దేశ జీడీపీలో 60 శాతాన్ని సమకూర్చే ప్రైవేటు వినియోగం (ప్రజల కొనుగోళ్లు) తగ్గిందని ఆర్థిక వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామీణ డిమాండ్ పుంజుకున్నప్పటికీ, పట్టణాల్లో వినియోగ డిమాండ్ సన్నగిల్లిందని వారంటున్నారు.
ధరల పెరుగుదలతో తగ్గిన కొనుగోలు శక్తి
ద్రవ్యోల్బణం వృద్ధిని దిగజారుస్తున్నదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ అక్టోబర్ నెలలో రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం 10.87 శాతానికి ఎగిసి, వినియోగదారుల కొనుగోలు శక్తిని దెబ్బతీసిందన్నారు. ఆహారోత్పత్తుల ధరల భారీ పెరుగుదలతో రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతనికి పెరిగి ఆర్బీఐ నిర్దేశిత లక్ష్యాన్ని దాటేసింది. గత నాలుగేండ్లలో ఎన్నడూ లేనంత బలహీన ఆర్థిక ఫలితాల్ని ఈ క్యూ2లో కార్పొరేట్లు వెల్లడించాయని, ఈ నేపథ్యంలో పెట్టుబడులు మందగించాయని వారు విశ్లేషించారు.
తయారీ నిస్తేజం, కోలుకున్న వ్యవసాయం
* క్యూ2లో తయారీ రంగం కేవలం 2.2 శాతం వృద్ధినే సాధించగా, మైనింగ్ రంగం వృద్ధి 0.1 శాతం క్షీణించింది. నిరుడు క్యూ2లో తయారీ 14.3 శాతం వృద్ధి సాధించగా, మైనింగ్ రంగం 11.1 శాతం వృద్ధిచెందింది.
* గత నాలుగు త్రైమాసికాలతో పోలిస్తే వ్యవసాయ రంగం వృద్ధి రేటు ఈ ద్వితీయ త్రైమాసికంలో మాత్రం 3.5 శాతానికి మెరుగుపడింది
* నిర్మాణ రంగం 7.7 శాతం వృద్ధి సాధించింది. ఈ రంగం కూడా నిరుడు సాధించిన 13.6 శాతంకంటే తక్కువ వృద్ధినే కనపర్చింది.
* ట్రేడ్, హోటల్స్, రవాణా విభాగాలు 6 శాతం వృద్ధి కనపర్చగా, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సర్వీసుల వృద్ధి రేటు 3.3 శాతానికి పరిమితమయ్యింది. గత ఏడాది ఈ సర్వీసులు 10.5 శాతం పెరిగాయి. మొత్తంగా సేవల రంగం 7.1 శాతం వృద్ధిచెందింది.