calender_icon.png 8 October, 2024 | 7:45 PM

జీడీపీ నత్తనడక

31-08-2024 12:42:37 AM

  1. 15 నెలల కనిష్ఠానికి తగ్గిన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 
  2. ఏప్రిల్ త్రైమాసికంలో 6.7 శాతానికి పరిమితం

న్యూఢిల్లీ, ఆగస్టు 30: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరు నెమ్మదించింది. ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 15 నెలల కనిష్ఠస్థాయి 6.7 శాతానికి మందగించినట్లు శుక్రవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. వ్యవసాయ, సర్వీసు రంగాల పనితీరు నిరుత్సాహపర్చడంతో క్యూ1లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరు తగ్గడానికి కారణం. 2023 జనవరి త్రైమాసికంలో నమోదైన 6.2 శాతం వృద్ధి రేటు తర్వాత ఇదే కనిష్ఠ రేటు. నిరుడు 2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ 8.2 శాతం వృద్ధిచెందింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు తగ్గినప్పటికీ, ప్రపంచంలో వేగంగా వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా హోదాను నిలుపుకున్నది. 2024 ఏప్రిల్ చైనా 4.7 శాతం వృద్ధిని కనపర్చింది. 

క్యూ1 వాస్తవ జీడీపీ రూ.43.64 లక్షల కోట్లు

స్థిర ధరల ప్రకారం 2024 క్యూ1లో వాస్తవ జీడీపీ రూ.43.64 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నట్లు ఎన్‌ఎస్‌వో తెలిపింది. 2023 క్యూ1లో ఇది రూ.40.91 లక్షల కోట్లు. దీని ప్రకారం వృద్ధి 6.7 శాతమని పేర్కొంది. ప్రస్తుత ధరల ప్రకారం 2024 క్యూ1లో నామినల్ జీడీపీ గత ఏడాది క్యూ1తో పోలిస్తే 9.7 శాతం వృద్ధిచెంది రూ. 70.50 లక్షల కోట్ల నుంచి రూ. 77.31 లక్షల కోట్లకు పెరిగినట్లు ఎన్‌ఎస్‌వో వివరించింది. ఈ క్యూ1లో వాస్తవ జీవీఏ 6.8 శాతం వృద్ధితో రూ.38.12 లక్షల కోట్ల నుంచి రూ.40.73 లక్షల కోట్లకు పెరగ్గా, నామినల్ జీవీఏ 9.8 శాతం వృద్ధితో రూ.63.96 లక్షల కోట్ల నుంచి రూ. 70.25 లక్షల కోట్లకు పెరిగినట్లు ఎన్‌ఎస్‌వో తెలిపింది. 

ఆందోళన చెందనక్కర్లేదు

గత ఆర్థిక సంవత్సరం (2023 క్యూ4లో సాధించిన 7.8 శాతంతో పోలిస్తే ఈ క్యూ1లో తమ అంచనాల మేరకే తగ్గిందని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అతిది నాయర్ చెప్పారు. అయితే ఈ రెండు త్రైమాసికాల మధ్య జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) వృద్ధి ఆశ్చర్యకరంగా 6.3 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగిందన్నారు. నికర పరోక్ష పన్నుల వృద్ధి సాధారణీకరణ కావడమే జీడీపీ, జీవీఏ వృద్ధి రేటులో తేడాకు కారణమని, ఈ నేపథ్యంలో జీడీపీ వృద్ధి తగ్గుదల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాయర్ వివరించారు. క్యూ1లో జీవీఏ వృద్ధి తమ అంచనాల్ని మించిందని, ప్రత్యేకించి నిర్మాణ రంగం వృద్ధి రేటు రెండంకెలకు చేరడం ఆశ్చర్యపర్చిందని నాయర్ చెప్పారు.

తగ్గిన వ్యవసాయ రంగం, సర్వీసుల వృద్ధి

తాజాగా జాతీయ గణాంకాల శాఖ (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏప్రిల్‌జూన్ త్రైమాసికంలో నిరుడు ఇదేకాలంతో పోలిస్తే  వ్యవసాయ రంగం గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) వృద్ధి రేటు 3.7 శాతం నుంచి 2 శాతానికి తగ్గింది. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసుల జీవీఏ వృద్ధి  కూడా 12.6 శాతం నుంచి 7.1 శాతానికి పడిపోయింది. అయితే తయారీ రంగం మాత్రం ఈ క్యూ1లో 5 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. మైనింగ్ రంగం జీవీఏ వృద్ధి 7 శాతం నుంచి 7.2 శాతానికి పెరగ్గా, విద్యుత్, గ్యాస్, నీటిసరఫరా, ఇతర యుటిలిటీ సర్వీసుల వృద్ధి గణనీయంగా 3.2 శాతం నుంచి 10.4 శాతానికి ఎగిసింది. కన్‌స్ట్రక్షన్ విభాగం వృద్ధి రేటు సైతం 8.6 శాతం నుంచి 10.5 శాతానికి చేరింది. ట్రేడ్, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసుల వృద్ధి మాత్రం 9.7 శాతం నుంచి 5.7 శాతానికి దిగింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్, ఇతర సర్వీసుల వృద్ధి రేటు 8.3 శాతం నుంచి 9.5 శాతానికి చేరింది.