calender_icon.png 8 January, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగేండ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధి రేటు

08-01-2025 12:00:00 AM

  • 2024 6.4 శాతానికి పరిమితం
  • కేంద్ర ప్రభుత్వం షాకింగ్ అంచనాలు

న్యూఢిల్లీ, జనవరి 7 :  కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం షాకింగ్ అంచనాల్ని విడుదల చేసింది. తయారీ, సర్వీసుల రంగాల బలహీన పనితీరు కారణంగా స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) ప్రస్తుత 2024.25 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు నాలుగేండ్ల కనిష్ఠస్థాయి 6.4 శాతానికి మందగిస్తుందని మంగళవారం తెలిపింది.

కొవిడ్ సంక్షోభ సంవత్సరమైన 2020 తర్వాత ఇదే కనిష్ఠ వృద్ధి రేటు. ఆ ఏడాది జీడీపీ వృద్ధి మైనస్‌లోకి జారిపోయి 5.8 శాతం ప్రతికూల వృద్ధి నమోదయ్యింది. 2021 9.7 శాతం, 2022 7 శాతం, 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం చొప్పున ఆర్థిక వ్యవస్థ వృద్ధిచెందింది. 

గత అంచనాలన్నీ దిగదుడుపు

తాజాగా జాతీయ గణాంకాల శాఖ (ఎన్‌ఎస్‌వో) 2024 సంవత్సరానికి విడుదల చేసిన 6.4 శాతం వృద్ధి రేటు అంచనా ఆర్థిక శాఖ, రిజర్వ్‌బ్యాంక్ గతంలో వెల్లడించిన అంచనాలన్నింటికంటే తక్కువ. జీడీపీ 6.6 శాతం వృద్ధిచెందవచ్చని 2024 డిసెంబర్‌లో రిజర్వ్‌బ్యాంక్ అంచనాల్ని ప్రకటించింది.

ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.57 శాతంగా ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ అంచనాల్ని వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న  లోక్‌సభకు సమర్పించే బడ్జెట్ రూపకల్పనకు మంగళవారం ఎన్‌ఎస్‌వో విడుదల చేసిన ముందస్తు అంచనాల్ని పరిగణనలోకి తీసుకుంటారు. 

5.3 శాతానికి తయారీ వృద్ధి

తయారీ రంగం వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఎన్‌ఎస్‌వో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం 9.9 శాతం వృద్ధిచెందింది. వ్యాపార సేవలు, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్లు తదితరాలతో కూడిన సర్వీసుల రంగం వృద్ధి రేటు 6.4 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గుతుందని గణాంకాల శాఖ అంచనా వేసింది. 

వ్యవసాయ రంగం వృద్ధి అధికం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం వృద్ధి మాత్రం జోరందు కుంటుందని ఎన్‌ఎస్‌వో పేర్కొంది. 2023 కేవలం 1.4 శాతం వృద్ధి రేటుకే పరిమితమైన వ్యవసాయ రం గం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.8 శాతం వృద్ధి సాధిస్తుందని తెలిపింది. 

జీడీపీ విలువ రూ.324.11 లక్షల కోట్లు

ప్రస్తుత ధరల ప్రకారం జీడీపీ (నామినల్ జీడీపీ) 2024 9.7 శాతం వృద్ధిచెంది రూ. 324.11 లక్షల కోట్లకు (3.8 ట్రిలియన్ డాలర్లు) చేరుతుందని ఎన్‌ఎస్‌వో తాజా అంచనాల్లో పేర్కొంది. 2023 9.6 శాతం వృద్ధిచెంది రూ. 295.36 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2024 నామినల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) 9.3 శాతం వృద్ధితో రూ.267.62 లక్షల కోట్ల నుంచి రూ.292.64 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది.

స్థిర ధరల ప్రకారం ప్రైవేటు వినియోగ వ్యయాలు 7.3 శాతం వృద్ధిచెందుతాయని తెలిపింది. గత ఏడాది ఈ వ్యయాల వృద్ధి 4 శాతం. ప్రభుత్వ తుది వినియోగ వ్యయాలు స్థిర ధరల ప్రకారం 4.1 శాతం పెరుగుతాయని, గత ఏడాది ఈ వృద్ధి 2.5 శాతమని ఎన్‌ఎస్‌వో వివరించింది. 

తలసరి వార్షిక ఆదాయం రూ.2,00,162

ప్రస్తుత ధరల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో తలసరి వార్షిక ఆదాయం 8.7 శాతం వృద్ధితో రూ.2,00,162కు చేరుతుందని ఎన్‌ఎస్‌వో అంచనాల్లో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,84,205 చొప్పున వార్షిక తలసరి ఆదాయం నమోదయ్యింది.