* డెలాయిట్ అంచనా
న్యూఢిల్లీ, జనవరి 21: ప్రస్తుత 2024 25 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తుందని కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యం లో దేశీయ పటిష్ఠతల మద్దతుతో భారత్ క్రమ వృద్ధిని సాధిస్తుందని డెలాయిట్ మంగళవారం విడుదల చేసిన అంచనాల్లో పేర్కొంది.
దేశీయ, అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ, అధిక విలువగల తయారీ ఉత్పత్తులు..ప్రత్యేకించి ఎలక్ట్రానిక్స్, మెషినరీ ఎగుమతుల వాటాను భారత్ పెంచుకున్నదని డెలాయిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో 2024 జీడీపీ 6.5 శాతం, తదుపరి సంవత్సరం 6.7 శాతం మేర వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎన్నికల అనిశ్చితి, ద్వితీయ త్రైమాసికంలో వాతావరణ సంబంధిత అవరోధాలతో ప్రధమార్థంలో జీడీపీ తగ్గిందని డెలా యిట్ ఇండియా ఎకానమిస్ట్ రుక్మి మజుందార్ తెలిపారు. ప్రధమార్థంలో ప్ర భుత్వ మూలధన వ్యయాలు వార్షిక లక్ష్యం లో 37.3 శాతానికే పరిమితమయ్యాయని, అవి వచ్చే రోజుల్లో పెరుగుతాయని అంచ నా వేస్తున్నామన్నారు.
వచ్చే బడ్జెట్లో పెట్టుబడుల ప్రక్రియ సరళీకరణ, గృహ పొదుపు సంరక్షణ, ఆర్థిక అక్షరాస్యత పెంపునకు చర్యలు ఉంటాయని అంచనా వేస్తున్నామని మజుందార్ తెలిపారు. వినియోగ డిమాండ్ పెంపుదలకు ప్రతిపాదనలు ఉంటాయన్నారు.