* డెలాయిట్ అంచనా
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: దేశీయ వినియోగం పెరిగినందున, ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.5--- శాతంగా నమోదుకావచ్చని కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ అంచనా వేసింది. తదుపరి 2025 ఆర్థిక సంవత్సరంలో మరింత మెరుగుపడి వృద్ధి రేటు 6.7 శాతానికి పెరుగుతుందని డెలాయిట్ ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
ప్రస్తుత 2025 ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో ఎన్నికల అనిశ్చితి, అధిక వర్షపాతం, భౌగోళికరాజకీయ పరిస్థితులతో దేశీయ డిమాండ్, ఎగుమతులు తగ్గినందున వృద్ధి మందగించిందని డెలాయిట్ ఇండియా ఎకానమిస్ట్ రుక్మి మజుందార్ వివరించారు.
అయితే కొన్ని విభాగాలు మెరుగైన పనితీరు కనపర్చాయని, సర్వీసుల వృద్ధి, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, కెమికల్స్ వంటి అధిక విలువగల తయారీ ఉత్పత్తుల ఎగుమతులు పుంజుకున్నాయన్నారు. ఇన్‌ఫ్రా వృద్ధి, డిజిటలైజేషన్‌పై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం పెంపొందిందని చెప్పారు.
ఈ పరిణామాలతో తాము వృద్ధి రేటు పట్ల ఆశావహంగా ఉన్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం, 6.8 శాతం మధ్యలో జీడీపీ వృద్ధిచెందుతుందని, వచ్చే ఏడాది మరింత పెరుగుదలతో 6.7 శాతం, 7.3 శాతం మధ్యలో వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు మజుందార్ వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాల్ని రిజర్వ్‌బ్యాంక్ ఈ నెలలో 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ సవాళ్లు
పలు అంతర్జాతీయ సవాళ్లను భార త్ ఎదుర్కోవాల్సి ఉంటుందని డెలాయి ట్ ఎకానమిస్ట్ హెచ్చరించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాలు, సరఫరా అడ్డంకులు తదితర సవాళ్లు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం, వృద్ధి రేటుపై ప్రభావం చూపిస్తాయన్నారు.
యూఎస్ వాణిజ్య విధానాల మార్పు, వాణిజ్య నియంత్రణలు ఎగుమతులు డిమాండ్‌ను, దేశంలోకి వచ్చే మూలధన పెట్టుబడుల్ని ప్రభావితం చేయవచ్చని తెలిపారు. పశ్చిమ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరగడం మొదలైతే ఆయా దేశాల కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల కోతలు పరిమితంగా ఉంటాయన్నారు.
గ్లోబల్ లిక్విడిటీ తగ్గితే ద్రవ్య పరపతి విధానాన్ని రిజర్వ్‌బ్యాంక్ సరళం చేయలేకపోవచ్చని అంచనా వేశారు. వచ్చే కొద్ది ఏండ్లలో అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడకుండా సొంత బలాలపై భారత్ దృష్టిపెడితేనే వృద్ధిబాట పడతామని మజుందార్ చెప్పారు.
డెమోగ్రాఫిక్ డివిడెండ్‌ను ఉపయోగించుకోవడం, ఉపాధి పెంపునకు, నైపు ణ్యం మెరుగుకు పెట్టుబడుల ద్వారా మధ్యతరగతి సంపదను పెంచడం, ఎగుమతులను పెంచుకోవడానికి అధిక విలువగల తయారీ విభాగాలపై దృష్టిపెట్టడం ఫలితాలను ఇస్తుందని, ఈ ప్రాధా న్యతలపై వచ్చే బడ్జెట్లో విధాన చర్యలను ఆశిస్తున్నామని డెలాయిట్ ఎకానమిస్ట్ వివరించారు.