calender_icon.png 29 October, 2024 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గయ్యాళి అత్తకు వందేళ్లు

29-10-2024 12:09:52 AM

సూర్యకాంతం శత జయంతి ప్రత్యేకం

చెడామడా తిట్టేసిందట..

సూర్యకాంతం తనకు వంట మనిషి కావాలంటూ తమ బంధువు ఒకరిని ఉత్తరం ద్వారా కోరగా.. ఆయన ఒకామెతో మాట్లాడి మద్రాసుకు తీసుకెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు బయలుదేరారట. మార్గమధ్యంలో ఒకరు కలిసి ఎక్కడికని అడగ్గా విషయం చెప్పారట.

సూర్యకాంతం ఇంట్లో వంట చేయడానికని తెలుసుకున్న సదరు మహిళ.. తన వల్ల కాదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయిందట. మరోసారి సూర్యకాంతం కారులో వెళుతుండగా.. ఒకచోట కారు ఆగిపోయిందట. ఆ సమయంలో అటుగా వెళుతున్న మహిళ కారులోని సూర్యకాంతాన్ని గుర్తించి ‘నువ్వే కదా.. కోడళ్లను ఆరళ్లు పెట్టేది’ అంటూ చెడా మడా తిట్టేసిందట.

ఇలాంటి ఘటనలు సూర్యకాంతం జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ తమ బిడ్డలకు సూర్యకాంతం అని పేరు పెట్టాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతూ ఉంటారు. నేటికీ గయ్యాళి మహిళ కనిపిస్తే ఆమెకు సూర్యకాంతం అని పేరు పెట్టేస్తారు. అంతలా మన నిత్య జీవితంలో సూర్యాకాంతం పాతుకుపోయారు. ఆమె లేకున్నా నేటికీ ఎక్కడో ఒకచోట ఆమెను తలుస్తూనే ఉంటారు. 

రియల్ లైఫ్‌లో గొప్ప మనసున్న మనిషి..

1924 అక్టోబర్ 28న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కృష్ణరాయపురంలో జన్మించారు. తల్లిదండ్రులకు ఆమె 14వ సంతానం. ఆరేళ్ల వయసులోనే నాట్యం నేర్చకున్నారు. సినిమా పోస్టర్ల స్ఫూర్తితో నటించాలనే కోరికతో చెన్నైకు వెళ్లారు. 1949లో ధర్మాంగథ చిత్రంతో తెరంగేట్రం చేసిన సూర్యకాంతం ఇక ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. 1994 వరకూ నటిస్తూనే ఉన్నారు.

ఆమె చివరి చిత్రం ‘ఎస్పీ పరుశురాం’. రీల్ లైఫ్‌లో గయ్యాళితనానికి కేరాఫ్‌గా కనిపించే సూర్యకాంతం.. రియల్ లైఫ్‌లో గొప్ప మనసున్న మహామనిషి. తెరపై నిప్పులు కురిపిస్తూ ఉండే సూర్యకాంతం ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారట. ఇంటి నుంచి రకరకాల ఆహార పదార్థాలు వండుకొచ్చి షూటింగ్‌లో ఉన్నవారి కడుపు నింపి తను కూడా తినేవారట.

పాత్ర పరంగా ఆడి పోసుకున్నా.. షూటింగ్ అవగానే వారికి క్షమాపణ చెప్పేవారట. ‘సంసారం’ చిత్రంలో తొలిసారిగా ఆమెకు గయ్యాళి అత్త పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఆమె ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఇక అంతే గయ్యాళి పాత్ర అనగానే దర్శకనిర్మాతలకు సూర్యకాంతం తప్ప మరొకరు గుర్తొచ్చేవారు కాదు. అంతలా ఆమె గయ్యాళి అత్త పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారు.

మరణానికి ఆ మనోవేదన కూడా కారణం..

‘సంసారం’ చిత్రంలో గయ్యాళి అత్త పాత్రను ఒప్పుకున్న ఏడాదే ఆమె ఓ ఇంటివారయ్యారు. మద్రాస్ హైకోర్టు జడ్జి పెద్దిభొట్ల చలపతిరావును 1950లో వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సూర్యకాంతం అక్క కుమారుడైన పద్మనాభమూర్తిని దత్తత తీసుకున్నారు.

1978లో చలపతిరావు మరణించారు. ఆర్థిక లావాదేవీల విషయంలో సూర్యకాంతం చాలా నిక్కచ్చిగా ఉండేవారట. ప్రతిదీ తన కళ్లెదుటే జరగాలంటూ శాసించేవారట. అంత కచ్చితంగా ఉండే సూర్యకాంతం కూడా ఒక వ్యక్తి చేతిలో మోసపోయారట. సూర్యకాంతం మరణానికి ఈ మనోవేదన కూడా ఒక కారణమని చెబుతారు. 1994 డిసెంబర్ 18న చెన్నైలో కన్నుమూశారామె. 

గయ్యాళి అత్త.. 

గయ్యాళి భార్య.. 

గయ్యాళి సవతి తల్లి.. గయ్యాళి పొరుగింటి మహిళ.. 

పాత్ర ఏదైతేనేమి సా ర్థకత చేకూర్చేది మాత్రం ఒకే ఒక్కరు.. ఆమే సూర్యాకాంతం. నాటికీ.. నేటికీ.. ఎప్పటికీ గయ్యాళి పాత్రలకు ఆమె తరువాతే ఎవరైనా.. ఆమెకు సరిసాటి లేరన్నా అతిశ యోక్తి కాదేమో.. ఒక గయ్యాళి పాత్ర పేరు తో సినిమా తీస్తారా? కానీ సూర్యకాంతం పాత్ర పేరు మీదుగానే ‘గుండమ్మ కథ’ వచ్చింది.

ఈ సినిమా అతి పెద్ద విజయం సాధించింది. నాటి తరమే కాదు.. నేటి తరం కూడా ఈ సినిమాను ఇష్టపడుతుంది. ఒక హీరోయిన్‌కి అవకాశం చేజారి మరొకరికి వెళితే వారి ఆనందానికి అవధులుండవు. ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంటారు.

కానీ సూర్యకాంతం అలా కాదు.. ఒకరి బాధతో దక్కే సంతోషం తనకొద్దని కరాఖండీగా చెప్పేశారు. అంతటి గొప్ప మనసు సూర్యాకాంతానికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఆమె ఒప్పుకుని ఉంటే తెలుగు ప్రేక్షకులు ఇంతటి గయ్యాళి అత్తని మిస్ అయ్యుండేవారు. 

- ప్రజావాణి చీదిరాల