- సాంకేతిక కారణాలతో రెండు కొలువులను నిలిపేసిన విద్యాశాఖ
- విచారణ కోరుతున్న బాధితులు..
కామారెడ్డి, నవంబర్15 (విజయక్రాంతి): డీఎస్సీ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిందని ఆమె సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నది. కొలువు వచ్చిన తర్వాత, ఆమె 23 రోజులు ఉద్యోగం చేసింది. తర్వాత ఉ ద్యోగం ఊడిందంటూ విద్యాశాఖ ఉత్తర్వులు పంపించింది.
సాంకేతిక లోపాలతోనే ఆమెకు ఉద్యోగం వచ్చిందని, తర్వాత విద్యాశాఖ దానిని గుర్తించి ఆమెను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేసిందని తెలిసింది. ఈ విషయం నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. లావణ్య అనే అభ్యర్థి గత నెలలో టీచర్ ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నది.
సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో 125వ ర్యాంకు సాధించిన అభ్యర్థి భార్గవి గైర్హాజరైనట్లు సాఫ్ట్‌వేర్‌లో చూపించడంతోనే లావణ్యకు కొలువు వచ్చిందని, తర్వాత ఆ తప్పిదాన్ని సరిచేసి లావణ్యను విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిసింది. దీంతో లావణ్య తనకు న్యాయం చేయాలని విద్యాశాఖను డిమాండ్ చేస్తున్నది.
మరో అభ్యర్థి కూడా..
జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండకు చెందిన రచన డీఎడ్, బీఎడ్ పూర్తి చేసింది. డీఎస్సీ ఫలితాల్లో ఆమె స్కూల్ అసిస్టెంట్‌గా భౌతికశాస్త్రంలో ఐదో ర్యాంక్, ఎస్జీటీలో 60వ ర్యాంకు సాధించింది. ఎస్‌ఏ విభాగంలో మూడు పోస్టులు ఉండడంతో తనకు వచ్చే అవకాశం లేదని గుర్తించి ఆమె ఎస్జీటీ పోస్టును ఎంచుకుంది.
ఎస్సీ రిజర్వేషన్‌తో ఎస్‌ఏ పోస్ట్ వస్తుందని తెలిసి, ఆమె ఎస్జీటీ పోస్టుకు కాకుండా ఎస్‌ఏ పోస్ట్ వైపు ఆసక్తి తెలిపింది. తర్వాత ఎస్‌ఏ పోస్ట్‌కి ఎంపికైనట్లు రచనకు అధికారులు నియామక పత్రం అందించారు. ఆమె వెంటనే ఉద్యోగంలో చేరేందుకు డీఈవో కార్యాలయానికి వెళ్లారు. సాంకేతిక కారణంతో ఆమెకు ఉద్యోగం రాలేదని చెప్పడంతో రచన నీరుగారిపోయింది.
ఇద్దరు అభ్యర్థుల ఆశలు గల్లంతయ్యాయి. అధికారుల తప్పిదంతో వారి రాని ఉద్యోగం వచ్చిందని భావించారు. ఇద్దరు తమకు జరిగిన అన్యాయంపై కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.