అదానీ గ్రూప్స్ చైర్మన్ గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జైరాం రమేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన సెబీ చీఫ్ మాధభి పూరీ బచ్‌పైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
తాజా ఆరోపణలపై తక్షణమే జేపీసీ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. శీతాకాల సమావేశాల్లో సైతం ఈ అంశాన్ని లేవనెత్తనున్నట్టు స్పష్టం చేశారు. దేశ ఆస్తులను అదానీ కొల్లగొట్టారని ఆరోపించారు. అదానీని సెబీ చీఫ్ రక్షిస్తున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే ఆమెను పదవి నుంచి తొలగించి ఆమెపై కూడా విచారణ జరిపించాలని కోరారు. అదానీపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం మాత్రం ఆయనను అరెస్ట్ చేయదని రాహుల్ పేర్కొన్నారు. దానికి తాను గ్యారంటీ అన్నారు. అదానీని అరెస్ట్‌ల నుంచి మోదీ రక్షిస్తున్నారని ఆరోపించారు.