- డిఫెండర్ల హవా
- పత్తా లేని ఫజల్
- ప్రొ కబడ్డీ 11వ సీజన్
* కబడ్డీ ‘పట్టు’కు ఎంతో ప్రత్యేకత.. రెయిడర్లే కాకుండా పేరు మోసిన డిఫెండర్ల కోసం ప్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తుంటాయి. కానీ వారిలో కొంత మంది సత్తా చాటగా.. మరికొంత మంది విఫలమవుతుంటారు.
విజయక్రాంతి, ఖేల్ విభాగం : కబడ్డీ అనగానే.. పాదరసంలా పరుగులు పెడుతూ పాయింట్లు తెచ్చే రెయిడర్లు మాత్ర మే కాకుండా, ఉడుంపట్టు పట్టే డిఫెండర్లూ గుర్తొస్తుంటారు. ప్రస్తుతం జరుగుతున్న 11వ సీజన్‌లో కూడా కొన్ని జట్ల రెయిడర్లు మాత్రమే కాకుండా డిఫెండర్లు కూడా సత్తా చాటుతున్న వారి జాబితాలో ఉన్నారు.
పునేరికి చెందిన రైట్ కార్నర్ డిఫెండర్ గౌరవ్ ఖత్రీ ప్రస్తుతం జరుగుతున్న లీగ్‌లో అందరికంటే ఎక్కువ టాకిల్ పాయింట్స్ సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఎటువంటి అంచనాలు లేని గౌరవ్ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ తొడగొడుతున్నాడు. స్టార్ డిఫెండర్‌గా పేరుగాంచిన ఫజల్ బెంగాల్ కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.
కానీ ఈ సీజన్‌లో మాత్రం డిఫెండింగ్‌లో అంతగా రాణించలేకపోతున్నాడు. ఒకప్పుడు ఫజల్ ఆడుతున్న కార్నర్‌కి పోవడానికే రెయిడర్లు వణికిపోయేవారు. కానీ ఈ సీజన్‌లో మాత్రం ఫజల్‌ను అలవోకగా బోల్తా కొట్టిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో రెయిడర్లతో పాటు డిఫెండర్లకు కూడా కొదువ లేదు. కేవలం ఈ ఇద్దరు మాత్రమే కాకుండా చియానే, అస్లాం ఇనాందార్ వంటి ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు.
గుజరాత్‌కు తప్పని షాక్..
సీజన్‌లో భాగంగా సోమవారం గచ్చిబౌలి వేదికగా జరిగిన గుజరాత్‌తో మ్యాచ్‌లో పునేరి పల్టన్ విజయం సాధించింది. పునేరి పల్టన్ 49-30 తేడాతో గుజ రాత్‌పై నెగ్గింది. పునేరి జట్టులో రెయిడర్ ఆకాశ్ షిండే సూపర్ టెన్ సాధించి విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఆకాశ్‌కి తోడుగా పంకజ్, మోహిత్, డిఫెండర్లు నందరాజన్, గౌరవ్‌లు కూడా రాణించడంతో పునేరి విజయం సులువయింది. గుజరాత్ జట్టులో కూడా గుమన్ సింగ్ సూపర్ టెన్ సాధించినా కానీ మిగతా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో గుజరాత్‌కు ఓటమి తప్పలేదు. గుమన్ సింగ్ తర్వాత హిమాన్షు సింగ్ 5 రెయిడ్ పాయింట్లతో పర్వాలేదనిపించాడు.
బెంగళూరుకు రెండో విజయం
ఉత్కంఠభరితంగా సాగిన రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 36-32 తేడాతో తమిళ్ తలైవాస్‌ను మట్టికరిపించింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో చివరి నిమిషాల్లో తమిళ్ తలైవాస్ ఆటగాళ్లు చేతులెత్తేయడంతో బెంగళూరు విజయం సాధి ంచింది. బెంగళూరు జట్టులో అజింక్య పవార్, తమిళ్ జట్టులో నరేందర్ కండోలా ఆరేసి పాయింట్లు సాధించారు.
ఇక స్టార్ రైడర్ సచిన్ తన్వర్ ఐదు రెయిడ్ పాయింట్లతో పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు బెంగళూరు ఆటగాళ్లకు అంపైర్లు గ్రీన్ కార్డు జారీ చేయడం గమనార్హం. బెంగళూరు డిఫెండర్ సురేందర్ హైఫై సాధించాడు. ఈ విజయంతో బెంగళూరు చివరి స్థానం నుంచి పదకొండో స్థానానికి చేరుకుంది. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో యూపీ యోధాస్, యు ముంబాతో దబంగ్ ఢిల్లీ అమీతుమీ తేల్చుకోనున్నాయి.