* కబ్జాదారులతో బల్దియా అధికారుల కుమ్మక్కు
* జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ఆరెకటిక సంఘం నేతల ఆందోళన
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (విజయక్రాంతి): గౌలిపురా కబేలా స్థలాన్ని కబ్జాచేసిన వారితో బల్దియా అధికారులు కుమ్మక్కయ్యారంటూ సీపీఎం రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు గౌలిపుర కబేలాను కాపాడాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆరెకటిక సంఘం, సీపీఎం సంయుక్త ఆధ్వ్రయంలో శనివారం నిరసన ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. గౌలిపుర మున్సిపల్ కబేలా పాత నగరంలో అత్యంత పురాతనమైందన్నారు. 1955 నుంచి పహాని, రెవెన్యూ రికార్డులలో 4.22 ఎకరాల స్థలంలో కబేలా ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్టు తెలిపారు. అయితే జీహెచ్‌ఎంసీ అధికారుల ప్రమేయంతో ప్రస్తుతం కబేలా ఆక్రమణలకు గురైందన్నారు.
బల్దియా అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కై హైకోర్టులో అఫిడవిట్ వేయడంతో కబ్జాదారులకు అనూకలమైన తీర్పు వచ్చిందన్నారు. జీహెచ్‌ఎంసీ తక్షణమే స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్‌ను నియామకం చేసి కబేలా స్థలాన్ని కాపాడాలన్నారు. అనంతరం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆరెకటిక సంఘం అధ్యక్షులు యశ్వంతరావు, ప్రధాన కార్యదర్శి రమేష్, స్లాటర్ హౌస్ వర్కర్స్ యూనియన్ నాయకులు శివకుమార్, సీపీఎం యాకుత్‌పురా జోన్ కార్యదర్శి బాలు తదితరులు పాల్గొన్నారు.