13-04-2025 10:35:56 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జేఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత కలిసిన మిత్రులు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఘనంగా సన్మానించి, ఆత్మీయ పలకరింపులు భావొద్వేగాల మధ్య సమ్మేళనం చిన్ననాటి జ్ఞాపకాలతో స్నేహితులు మునిగితేలారు. ప్రతి మనిషి జీవితంలో చిన్ననాటి మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. చిన్ననాటి గిల్లి గజ్జాలు. బుజ్జగింపులు, చిలిపి పనులు గుర్తుకు వచ్చినప్పుడల్లా ప్రతి మనిషిలో కలిగి ఆనందం అంతా ఇంత ఉండదు. చిన్ననాటి స్నేహితులను కలిసి పాత రోజులు గుర్తు చేసుకోవడంలో భాగంగా ఈ మధ్యకాలంలో చాలా మంది పూర్వ విద్యార్థుల సమ్మేళనాల పేర్లతో అందరూ ఒకచోట కలిసి తమ మిత్రులను స్మరించుకుంటున్నారు.
ఎల్లారెడ్డి పట్టణ పరిధిలో గత 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వ పాఠశాలలో 1995 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం ఎల్లారెడ్డిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. కమ్యూనికేషన్ రంగం అభివృద్ధి చెందడంతో పాత స్నేహితుల సెల్ నెంబర్లు సేకరించిన స్థానిక మిత్రులు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సైతం ఈ సంబంధానికి ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో తమ గురువులకు శాలువ కప్పి పుష్ప గుచ్చాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ కళ్ళ ముందు చిన్నపిల్లలుగా విద్య బుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు ప్రయోజకులుగా ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్య నేర్పిన గురువులను సైతం గుర్తుంచుకొని వారిని వెతికి ఈ సమయానికి ఆహ్వానించడం చాలా సంతోషం కలిగించిందన్నారు.
మీ అందరిని చూస్తుంటే మీతో తరగతి గదిలో పాఠం చెబుతూ గడిచిన పాత రోజులే గుర్తొస్తున్నాయన్నారు. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మరింత ఉన్నతి సాధించాలని జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్సు పూర్తిగా ఆశీర్వదిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆత్మీయ సమయంలో పాల్గొన్న గురువులు షర్ఫులక్,కిషన్ ,జగదీశ్వర్ , కిష్టయ్య, ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన పూర్వ విద్యార్థులు ఒక్కొక్కరిగా తమ చిన్ననాటి మధుర స్మృతులను జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు తరగతి గదిలో చేసిన అల్లరిని ఆడిన ఆటలను గుర్తు చేసుకున్నారు. తమ ఆత్మీయ మిత్రుల వద్ద 30 సంవత్సరాలలో జరిగిన సంఘటనను కలిగిన బాధలను పంచుకున్నారు. ఈ సమ్మేళనానికి విచ్చేసిన మిత్రులందరికీ నిర్వాహ కమిటీ సభ్యులు జ్ఞాపికాలను అందజేశారు. చివరకు తమ పాత స్నేహితులను వదిలి పోలేక మళ్ళీ వచ్చే సంవత్సరం తప్పక కలుద్దామని చిన్న ఆశతో బరువైన హృదయాలతో ఒక్కొక్కరుగా సమ్మేళన ప్రాంగణం నుండి తరలి వెళ్ళిపోయారు.