calender_icon.png 29 September, 2024 | 9:04 PM

సగం మందికే గ్యాస్ సబ్సిడీ!

29-09-2024 12:00:00 AM

దక్కనివారంతా ఏజెన్సీలకు పరుగులు 

46 లక్షల మంది ఖాతాలోనే నగదు జమ 

ప్రజాపాలన దరఖాస్తుల్లో వివరాల సమర్పించక ఇబ్బందులు

పూర్తి సమాచారం ఇచ్చినవారికే రాయితీ అంటున్న అధికారులు 

హైదరాబాద్, సెప్టెంబర్ 2౮ (విజయక్రాంతి): రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.

అర్హులైన వారికి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. వారం రోజుల కింద రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పత్రాలను అందజేసింది. పౌరసరఫరాల శాఖ గణాంకాల ప్రకారం 46 లక్షలకు పైగా వినియోగదారులకు ఈ నెలలో సుమారు రూ.23 కోట్ల సబ్సిడీ డబ్బులను జమ చేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 89.94 లక్షల రేషన్‌కార్డులుండగా వాటి ద్వారా 2.85 కోట్ల మంది లబ్ధిపొందుతున్నారు. ఈ కుటుంబాలందరికీ గ్యాస్ కనెక్షన్ ఉంది. కానీ లబ్ధిదారుల్లో సగం మందికే సబ్సిడీ వస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో చాలా మంది తమ వివరాలను తప్పుగా ఎంట్రీ చేశారని, దీనికి తోడు రేషన్ దుకాణాల్లో ఈకేవైసీ చేయించుకోకపోవడంతో రాయితీ పొందలేకపోతున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

గ్యాస్ ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు

సబ్సిడీ డబ్బులు అందనివారు తమకు ఎందుకు రావ డం లేదని స్థానికంగా ఉండే గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని, పౌరసరఫరాల శాఖ అధికారులను సం ప్రదించాలని తేల్చుకోవాలని ఏజెన్సీ నిర్వాహకులు  సమాధానమిస్తున్నారు.

దీంతో ఎక్కడికి వెళ్లి తమ సమస్యను పరిష్కరించుకోవాలో తెలియక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఉచిత విద్యుత్ విషయంలోనూ తమకు రాయితీ వర్తించడం లేదని వాపోతున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రజాపాలన సందర్భంగా తమతో హడావుడిగా దరఖాస్తులు నిపించారని, తీరా ఇప్పుడు అడిగితే ముఖం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరో అవకాశం ఇవ్వాలి

కాంగ్రెస్ అధికారం చేపట్టిన నెలరోజుల తర్వాత ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకుందని, అదే తరహాలో మరోసారి దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తే రాయితీ రానివారు తిరిగి అప్లికేషన్ చేసుకుంటారని ప్రజలు కోరుతున్నారు. రాయితీల విషయమై తమకు దరఖాస్తులు వస్తున్నాయని, ప్రభుత్వ పెద్దలకు నివేదించామని, త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని రాష్ట్ర పౌరసరఫరాల అధికారులు పేర్కొంటున్నారు.