calender_icon.png 25 September, 2024 | 9:59 AM

గ్యాస్ సిలిండర్ బ్లాక్ దందా

25-09-2024 03:41:00 AM

  1. హోటళ్లు, దాబాలకు సరఫరా
  2. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న దామరంచ గ్రామస్తులు

వెల్దుర్తి, సెప్టెంబర్ 24: వినియోగదారులకు పంపిణీ చేయాల్సిన గ్యాస్‌ను వేరే సిలిండర్లలో నింపుతూ అక్రమంగా గ్యాస్ దందా కొనసాగిస్తున్న ఏజెన్సీ నిర్వాహకుల భాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. వెల్దుర్తికి చెందిన ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుంచి ఓ లారీ సిలిండర్లతో మంగళవారం దామరంచ గ్రామానికి వచ్చింది.

లారీతో పాటు వచ్చిన గ్యాస్ ఏజెన్సీకి చెందిన సిబ్బంది గ్రామ శివారులో నిండు సిలిండర్ల నుంచి ఖాళీ సిలిండర్లలోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గ్రామస్తులు చూసి పట్టుకున్నారు. వినియోగదారులకు పంపిణీ చేయ ల్సిన గ్యాస్‌లో కోత విధిస్తూ అక్రమంగా అమ్ముకుంటున్నారని నిలదీశారు.

విషయం తెలుసుకున్న గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు వెన్నవరం శ్రీనివాస్‌రెడ్డి అక్కడికి చేరుకొని గ్రామస్తులను దబాయించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇదివరకు కూడా వెల్దుర్తి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు బ్లాక్‌లో గ్యాస్ దందా కొనసాగిస్తున్న విషయం సంబంధిత అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. మరోసారి ఇలాంటి సంఘటన జరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారులు సదరు డీలర్‌పై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.