calender_icon.png 20 April, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుల పండువగా గరుడపట ధ్వజారోహణ

05-04-2025 01:00:48 AM

పాల్గొన్న పలువురు భక్తులు

భద్రాచలం. ఏప్రిల్ 4 (విజయ క్రాంతి) శ్రీసీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా  శుక్రవారం నిర్వహించిన గరుడ పట ధ్వజారోహణం కన్నుల పండుగగా సాగింది. ముందుగా బేడా మండపంలో ఉత్సవ మూర్తుల ఎదుట అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాన్ని అర్చకులు దిగ్విజయంగా నిర్వహించారు. అనంతరం గరుడ పటాన్ని మేళతాలమధ్య, వేద మంత్రోచ్చారణల మధ్య ఉత్సవ మూర్తుల సాక్షిగా ఆలయ ధ్వజస్తంభం పై ఎగురవేశారు. శ్రీమహావిష్ణువు ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలకు సంకేతంగా అటు దేవతలకు, ఇటు మానవజాతికి తెలిపేలా గరుడపట ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు.

అలాగే అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు, దేవతలకు ఆహ్వానించే భేరి పూజ కార్యక్రమాన్ని ఆచార్యులు వైభవంగా నిర్వహించారు. గరుడ పట ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతుని పేర గరుడ ముద్దలు ప్రసాదాన్ని అర్చకులు మహిళలకు పంపిణీ చేశారు. ఈ గరుడ ముద్ద ప్రసాదాన్ని సంతానం లేని మహిళలకు, రుగ్మతలతో బాధపడే వారికి పంపిణీ చేశారు ఆలయ అర్చకులు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, వేద పండితులు, అర్చకులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.