10-03-2025 12:06:03 AM
హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) కన్నుమూశారు. తిరుపతిలోని తన స్వగృహంలో గుండెపోటు రావటంతో తుదిశ్వాస విడిచారు. వెయ్యికిపైగా అన్నమాచార్య సంకీర్తలకు స్వర కల్పన చేసిన గరిమెళ్ల.. ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ప్రఖ్యాతిగాంచారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘జగడపు చనవుల జాజర’, ‘పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు’ వంటి పలు కీర్తనలకు ఆయనే స్వరాలు సమకూర్చారు.
సంప్రదాయ కర్ణాటక, లలిత, జానపద సంగీతంలోనూ ఆయన ప్రసిద్ధులు. గత శుక్రవారం యాదగిరి గుట్టలోనూ గరిమెళ్ల తన ప్రదర్శనతో ఆహూతులను అలరించారు. ఇంతలోనే ఆయన మరణవార్త రావడంతో సంగీత ప్రపచంలో విషాదం నిండినట్టయ్యింది. పలువురు సంగీత, ఆధ్యాత్మిక, రాజకీయ రంగాల ప్రముఖులు గరిమెళ్ల మృతి వార్తపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.