calender_icon.png 18 October, 2024 | 8:04 PM

గరంగరం.. సమోసా!

30-07-2024 12:05:00 AM

వాతావరణం చల్లగా ఉంది.. క్రిస్పీగా.. కొంచెం గరంగరంగా ఉండే సమోసాలు తింటే కడుపు నిండాల్సిందే! అందరూ ఇష్టంగా తినే చిరుతిండి కూడా ఇదే. నోట్లో పెడితే ఇట్టే కరిగిపోయే చిట్టి సమోసాలు వేడి వేడిగా తింటే ఆ రుచే వేరు. అందరూ ఇష్టపడే ఆనియన్.. ఆలూ.. కార్న్.. చీజ్‌తో పాటు చికెన్ సమోసాలు కూడా సులభంగా చేసుకోవచ్చు. వీటి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక సాయంకాలం ఒక కప్పు టీ తాగుతూ గరంగరం సమోసాలు తింటుంటే ఆ టేస్ట్ వేరే లెవల్. మరి మీరు కూడా ఇలాంటి ఫీలింగ్‌ను పొందాలనుకుంటున్నారా? అయితే ఇంట్లో ఈజీగా చేసుకునే సమోసాలెంటో చూసేయండి..

ఆలూ సమోసా

కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయ-ఒకటి, తరిగిన పచ్చి మిర్చి -మూడు, అల్లం తరుగు-చెంచా, ఆలూ-ఆరు, బఠాణీలు-పావు కప్పు, జీలకర్ర-అర చెంచా, కాజూ-గుప్పెడు, కిస్‌మిస్-ఏడెనిమిది, గరంమసాలా, చాట్  మసాలా- చెంచా చొప్పున, ఉప్పు-తగినంత, నూనె-వేయించడానికి సరిపడా.

తయారీ విధానం: ఆలుగడ్డలను శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేయాలి. ఇందులోనే బఠాణీలను వేసి నాలుగైదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఇప్పుడు వీటిని చల్లార్చి పొట్టుతీసి మెదిపి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక జీలకర్ర, కాజూ, కిస్‌మిస్ వేసి వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు కూడా కలిపి మరికాసేపు వేయిస్తే సరి. ఉల్లిపాయలు కాస్త గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత ఉడికించిన ఆలూ, బఠాణీలు కూడా వేసి కలపాలి. దీంట్లో గరంమసాలా, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే సమోసాలకు మసాలా కూర సిద్ధమైనట్లే. ఈ కూరను త్రికోణాకారంలో చుట్టుకున్న చపాతీలో పెట్టి అంచులు మూసేయాలి. వీటిని వేడి నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. గ్రీన్ చట్నీ, టొమాటో సాస్‌తో తీసుకుంటే బాగుంటాయి. 

చికెన్ సమోసా

కావాల్సిన పదార్థాలు: చికెన్ ముద-200 గ్రాములు, నూనె-మూడు చెంచాలు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు-రెండు చొప్పున, అల్లంవెల్లుల్లి ముద్ద పసుపు-పావు చెంచా, కారం-చెంచాన్నర, గరంమసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి-అరచెంచా చొప్పున, ఉప్పు-తగినంత, కొత్తిమీర తరుగు-కాస్తంత, నిమ్మరసం-రెండు చెంచాలు. 

తయారీ విధానం: పాత్రలో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద జత చేయాలి. ఆ తర్వాత చికెన్ వేసి కలపాలి. దీంట్లో కారం, పసుపు, ధనియాల పొడి, గరంమసాలా, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. చికెన్ ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపేయాలి. ఈ మిశ్రమాన్ని వేరొక పాత్రలోకి తీసుకొని చల్లార్చాలి. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకొని కోడిగుడ్డు ఆకాశంలో కాస్త మందంగా పూరీలా చేసుకోవాలి. దీంట్లో చికెన్ మిశ్రమాన్ని ఉంచి సమోసాలా చేయాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న సమోసాలను వేడి నూనెలో మంటను మధ్యస్థంగా పెట్టి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని టొమాటో కెచప్‌తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. 

చీజ్ సమోసా

ఇలా చేయండి 

సమోసాలు తయారు చేసే మైదా పిండిలో ఉప్పు, వాము, నూనె లేదా నెయ్యి, కాసిన్ని నీళ్లు కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి కలిపే విధానం అన్ని సమోసాలకు ఒకే రకంగా ఉంటుంది. అలాగే సమోసాలన చుట్టే విధానం కూడా. సమోసా చేసే పిండిని మొదట గుడ్డు ఆకారంలో చపాతీలా చేసుకోవాలి. దాన్ని రెండు సమాన భాగాలుగా కోయాలి. ఒక్కోభాగం అంచులను కలుపుతూ కోన్‌లా చేయాలి. ఇందులో మిశ్రమం పెట్టి పై అంచులను నీటితో తడుపుతూ మూసేయాలి. 

కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలుగడ్డలు -రెండు, ఉడికించిన స్వీట్‌కార్న్-కప్పు, చీజ్ తురుము-100 గ్రాములు, అల్లం తరుగు-చెంచా, తరిగిన పచ్చిమిర్చి-మూడు, కారం, జీలకర్రపొడి, చాట్ మసాలా-చెంచా చొప్పున, ఉప్పు- తగినంత, నిమ్మరసం-రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు-కొద్దిగా. 

తయారీ విధానం: పెద్ద గిన్నె తీసుకొని పై పదార్థాలన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి వేసుకుంటూ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సమోసా ఆకారంలో చేసిన చపాతీలో పెట్టి అంచులు మూసేయాలి. దీన్ని వేడి వేడి నూనెలో మంటను మధ్యస్థంగా పెట్టి లోపలి పదార్థాలన్నీ ఉడికేలా వేయించుకోవాలి. అంతే చాలా ఈజీగా చీజ్ సమోసా రెడి.

కార్న్ సమోసా

కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు-ఒక కప్పు, మైదా లేదా గోధుమ పిండి-ఒక కప్పు, పచ్చిమిర్చి-రెండు, తరిగిన అల్లం-చెంచా, జీలకర్రపొడి-అరచెంచా, మిరియాల పొడి-చెంచా, గరంమసాలా-చెంచాన్నర, ఉప్పు-రుచికి సరిపడా, నూనె-తగినంత, కొత్తిమీర తరుగు-రెండు చెంచాలు.

తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో మైదా పిండి తీసుకొని అందులో తగినంత ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌపై పాత్ర పెట్టి అందులో చెంచా నూనె వేసుకొని.. మొక్కజొన్న గింజలు, అల్లం తురుము, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి, గరంమసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర తురుము.. ఇలా అన్నింటిని వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలపాటు వేయించుకోవాలి. తర్వాత పిండితో చిన్న చిన్న చపాతీల్లా చేసుకొని వాటిని సమోసాలా మాదిరిగా మడత పెట్టి అందులో పై మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసేయాలి. వీటిని నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి. అంతే.. క్రిస్పీ క్రిస్పీగా ఉండే నోరూరించే కార్న్ సమోసాలు రెడి.!