చల్లటి వాతావరణం.. తినడానికి ఏదైనా గరం గరంగా ఉంటేనే కడుపు హాయిగా, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. సాయంత్రం పూట వేడి వేడి టీలు, కాఫీలు, బజ్జీలు, వేపుళ్లకు బదులుగా హెల్తీ సూప్స్‌ను తాగితే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. చలికాలంలో వచ్చే ఫ్లూ, దగ్గు, జలుబుకు మంచి ఔషధాలుగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ సూప్స్‌ను ఓసారి ట్రై చేయండి!
టమాట జింజర్ సూప్
కావాల్సిన పదార్థాలు: టమాట-రెండు, అల్లం-చిన్నముక్క, మిరియాల పొడి-అర చెంచా, ఉప్పు-తగినంత, వెన్న-ఒక చెంచా, ఫ్రెష్ క్రీం చెంచా, బిర్యానీ ఆకు--ఒకటి.
తయారీ విధానం: స్టవ్ మీద పాన్ పెట్టి ఒక చెంచా వెన్న వేయాలి. వెన్న వేడయ్యాక తరిగిన టమాట, అల్లం వేసి మూత పెట్టి సన్నటి మంటపై ఐదు నిమిషాలు మగ్గించి దించేయాలి. టమాట ముక్కలు చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టి వెన్న వేయాలి. వేడయ్యాక బిర్యానీ ఆకు, టమాట మిశ్రమం, మిరియాల పొడి, ఉప్పు వేసి అర చెంచా నీళ్లు పోసి మరిగించాలి. చివరగా ఫ్రెష్ క్రీం వేసి దించుకుంటే వేడి వేడి టమాట జింజర్ సూప్ రెడీ.
రాగి సూప్
కావాల్సిన పదార్థాలు: రాగి పిండి-ఒక కప్పు, బీన్స్, క్యారెట్, స్వీట్ కార్న్, కాలీఫ్లవర్-ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు-కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి-ఒకటి, తరిగిన అల్లం, వెల్లులి-ఒక చెంచా, నెయ్యి-ఒక చెంచా, మిరియాల పొడి-సగం చెంచా, ఉప్పు-తగినంత, పెరుగు-సగం కప్పు.
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకొని.. దానికి రెట్టింపు నీళ్లు పోసీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత కూరగాయలను సన్నగా కట్ చేసుకొని అన్నింటిని ఒక కప్పు వచ్చేలా కలిపి పక్కకు పెట్టుకోవాలి. అనంతరం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చివేసి కాసేపు వేయించాలి.
దాంట్లోనే క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్, కాలీఫ్లవర్, ఉల్లిపాయాలు వేసి సన్నటి మంటపై మగ్గనివ్వాలి. సగం కప్పు నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి. దీంట్లో ముందుగా కలిపి ఉంచుకున్న రాగి పిండి, సరిపడా ఉప్పు వేసి కాసేపు ఉడకబెట్టి దించేయాలి. చివరగా మిరియాల పొడి, పెరుగు వేసి కలిపి వేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
కార్న్ వెజ్ సూప్
కావాల్సిన పదార్థాలు: క్యారెట్-ఒకటి, బీన్స్-నాలుగు, పచ్చిమిర్చి-రెండు, స్వీట్ కార్న్-అర కప్పు, మిరియాల పొడి-సగం చెంచా, ఉప్పు-తగినంత, కార్న్‌ఫ్లోర్-ఒక చెంచా, కొత్తిమీర తురుము-కొద్దిగా, ఆలివ్ ఆయిల్-ఒక చెంచా.
తయారీ విధానం: ముందుగా తరిగిన క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ ఐదు నిమిషాల పాటు ఉడికించి నీళ్లు వంపి పక్కన పెట్టాలి. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేయాలి. వేడయ్యాక తరిగిన పచ్చిమిర్చి, ఉడికించిన క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ వేసి రెండు నిమిషాలపాటు వేయించాలి. మిరియాల పొడి, ఉప్పు వేసి క్యారెట్ ఉడికించిన నీళ్లు పోసి మరో ఐదు నిమిషాలు మరగనివ్వాలి. సగం కప్పు నీళ్లలో కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి మరుగుతున్న మిశ్రమంలో వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. చివరగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే కార్న్ వెజ్ సూప్ రెడీ.
చికెన్ సూప్
కావాల్సిన పదార్థాలు: చికెన్- చికెన్ ముక్కలు ఒక కప్పు, క్యారెట్, క్యాబేజీ, ఉల్లిపాయ, కార్న్ ఫ్లోర్, ఆలుగడ్డలు సన్నగా తరిగినవి ఒక కప్పు, ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకుల పొడి-ఒక చెంచా, అల్లం-సన్నటి ముక్కలు సగం చెంచా, బిర్యానీ ఆకు-ఒకటి, నూనె-ఒక చెంచా, పుదీనా ఆకులు, కొత్తిమీర తురుము-ఒక కప్పు, ఉప్పు-తగినంత.
తయారీ విధానం: శుభ్రంగా కడిగిన చికెన్‌లో ఉల్లిపాయ, జీలకర్ర, ధనియాల, మిరియాల, దాల్చిన చెక్క, అల్లం పేస్టు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్‌లో కొద్దిగా నూనె వేసి చికెన్, తరిగిన కూరగాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి ఆరు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. ఈ మిశ్రమంలో ఒక బిర్యానీ ఆకు, కొన్ని నీళ్లు పోసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర, పుదీనా వేస్తే వేడి వేడి చికెన్ సూప్ రెడీ.