calender_icon.png 19 October, 2024 | 2:08 PM

విద్యా బోధనలో అంతరాలను తొలగించాలి

19-10-2024 01:30:14 AM

పంచాయతీరాజ్ మంత్రి సీతక్క 

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): విద్యాబోధనలో ఉన్న అంతరాలను తొలగించాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో హైసా ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ విద్యా సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్య అని పేర్కొన్నారు. పట్టణ విద్యార్థులతో గ్రామీణ యువత పోటీ పడలేకపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సమానత్వ సాధన దిశలో విద్య చాలా కీలకమని మంత్రి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఎలాంటి విద్య అందుతుందో..  పల్లెల్లోనూ అలాంటి విద్య అందాలన్న లక్ష్యంతో తమ సర్కారు పని చేస్తోందన్నారు.

అచ్చంపేట, ఆదిలాబాద్, ములుగు, భద్రాచలం వంటి అటవీ ప్రాంతాల్లో విద్యావ్యాప్తికి కార్పొరేట్, సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఎన్‌జీవోలు ముందుకు రావడం ఆదర్శనీయమన్నారు. డిజిటల్ విద్య కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సీఎస్‌ఆర్ ఫండ్స్‌ను వెనుకబడ్డ ప్రాంతాలకు వెచ్చించాలని, గ్రామీణ విద్యార్థులకు అవకాశం కల్పిస్తే బాగా రాణిస్తారని చెప్పారు. గ్రామీణ విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ములుగు కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు.