calender_icon.png 14 March, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదాస్పదంగా మారిన గన్నికుంట చెరువు కబ్జా వ్యవహారం..!

14-03-2025 06:28:52 PM

విచారణ జరిపిన ఎస్ఐ రమేష్ 

కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ 

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని చాకేపల్లి గ్రామంలో గల గన్నికుంట చెరువు కబ్జా వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గతంలో టిడిపి ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఎస్టీ, ఎస్సీ రైతులకు జీవనోపాధి కింద సాగు భూములు పంపిణీ చేసింది. సాగు భూములకు నిరంధించాలని లక్ష్యంతో గన్నికుంట చెరువును 40 ఎకరాల విస్తీర్ణంలో డిపిఏపీ పథకం కింద గన్నికుంట చెరువును తవ్వించింది. ఈ చెరువులో 200 ముదిరాజ్ కుటుంబాలు చేపల పెంపకాన్ని చేపడుతూ జీవనోపాధి పొందుతున్నాయి. ఎస్టీలకు ప్రభుత్వం పంచిన భూములను కొంతమంది స్థానికులు కొనుగోలు చేసుకుని సాగు చేస్తున్నారు. చెరువు పక్కన బోరు ఏర్పాటు చేసుకుని వ్యవసాయానికి వినియోగిస్తుండడంతో వేసవిలో గన్నికుంట తడారిపోతుంది. ఇదే అదనుగా చేసుకొని చెరువు కింద సాగు చేస్తున్న కొంతమంది వ్యక్తులు చెరువు పై కన్నేసి మూడు రోజుల కింద మత్తడిని ధ్వంసం చేశారు. పది ఎకరాల చెరువు శిఖం ప్రాంతాన్ని ట్రాక్టర్లతో చదువులు చేసి ఆక్రమించే ప్రయత్నం చేశారు.

ఈ వ్యవహారం పూర్తి వివాదాస్పదమైంది. చెరువును కబ్జా చేస్తున్న విషయం గ్రామస్తులకు తెలియడంతో వారు ఇరిగేషన్, మత్స్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు స్పందించి చెరువు కబ్జా వ్యవహారంపై శుక్రవారం విచారణ జరిపారు. చెరువు పై జీవనోపాధి పొందుతున్న ముదిరాజ్ కుటుంబాలతో పాటు సాగు చేస్తున్న రైతులను తాళ్ల గురిజాల ఎస్సై చుంచు రమేష్ విచారించారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చెరువును ద్వంసం చేసి చదును చేశారని రైతులు వాంగ్మూలం ఇచ్చారు. రైతులు ఇచ్చిన నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎస్సై చుంచు రమేష్ తెలిపారు. గన్నికుంట శిఖం భూమిలో పది ఎకరాలకు పైగా చదును చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్ డిమాండ్ చేశారు. కబ్జాదారులపై చర్యలు తీసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

గ్రామానికి చెందిన ఎస్టీ రైతులు, ముదిరాజ్ కుటుంబంతో కలిసి ఐక్యంగా పోరాడి గన్నికుంట చెరువును కాపాడుకుంటామన్నారు. గ్రామానికి చెందిన రైతు దుర్గం రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో మాదిరిగానే ఈ ప్రభుత్వ పాలనలో కూడా యదేచ్చగా చెరువులు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు.  10 ఎకరాల్లో కబ్జాకు గురవుతున్న గన్నికుంట చెరువు వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే వినోద్ కల్పించుకొని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. గన్నికుంట చెరువు కబ్జా వ్యవహారంపై పోలీసులు జరిపిన విచారణలో రైతులు ఏట రాజన్న, జక్కం తిరుపతి, పులవేన రంగులు, పెసరి శ్రీను, బొగ్గుల శ్రీను, ఏటకారి శ్రీను, బొగ్గుల భాస్కర్, చిలుక లచ్చన్న, దూరం దినేష్, పులవేనా మల్లేష్, బొల్లి వెంకటేష్, చెన్న బానేష్, చెన్న సారయ్య, ధోని వెంకటేష్, ఏట భీమన్న, సూరం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.