- డార్క్‌నెట్ సైట్ల ద్వారా డ్రగ్స్
- విద్యాసంస్థల్లో యథేచ్ఛగా విక్రయాలు
- కఠిన చట్టాలున్నా పెట్రేగుతున్న అక్రమార్కులు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు రవాణా, విక్రయాలు ఒకప్పుడు గుట్టుగా సాగేవి. పోలీసుల కంట పడకుండా నడిచేది. అయితే, సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న అక్రమార్కులు పోలీసులకు చిక్కకుండా డార్క్‌నెట్ సైట్లు, వాట్సప్ గ్రూప్‌ల ద్వారా డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నారు. ఇటీవల గంజాయిపై ఎక్సైజ్, పోలీస్ నిఘా పెరగడంతో పలువురు అక్రమార్కులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది.
ఫోన్ చేస్తే గంజాయి సప్లు చేసే విధంగా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. డార్క్‌నెట్ సైట్లలో ఆర్డర్ చేస్తే నేరుగా కొరియర్ వచ్చేలా వ్యవస్థనే రూపొందించుకున్నారు. పాఠశాల మొదలు ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు డ్రగ్స్ వినియోగానికి కేంద్రాలుగా మారుతున్నాయి. డ్రగ్స్ వినియోగదారుల్లో అత్యధికంగా విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగించే అంశం.
గోవా, ఏపీ, ఢిల్లీ నుంచి..
గోవా, బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి ఎక్కువగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. విదేశాల నుంచీ హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఇటీవల ఎస్.ఆర్.నగర్‌లోని వెంకట్ బాయ్స్ హాస్టల్‌లో తనిఖీలు చేసిన ఎక్సైజ్ అధికారులు 115గ్రాముల ఎండిఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు భారీ సంఖ్యలో గంజాయి సరఫరా అవుతోంది. ఏపీలోని శ్రీకాకుళం, వైజాగ్, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాల నుంచి కూడా గంజాయి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. తక్కువ ధరకే లభిస్తుం డటం.. చాక్లెట్లు, ఆయిల్ రూపంలో దొరుకుతుండటంతో యువత, కార్మికులు గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్నారు.
భారీగా పట్టుబడుతున్న డ్రగ్స్, గంజాయి
ఎక్సైజ్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెండు నెలలుగా విస్తృత దాడులు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భారీగా గంజాయి, డ్రగ్స్‌ను స్వాధీ నం చేసుకుంటున్నారు. ఈ ఏడాది జూలై నాటికి ఎక్సైజ్ అధికారులు 498 కేసులు నమోదు చేశారు. 718 మందిని అరెస్ట్ చేయ గా.. 189 వాహనాలను సీజ్ చేశారు. వివిధ రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 22.83 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ పరిసరాల్లో ఎక్కడ గంజాయి దొరికినా.. నగరంలోని ధూల్‌పేట్‌తో సంబంధం ఉంటోంది.
తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త
తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలని సామాజికవేత్తలు, మానసిక నిపుణులు సూచిస్తున్నారు. సమాజంలో తల్లిదండ్రులు పిల్లలను స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. ఈ క్రమంలో పిల్లలు మత్తుపదార్థాల బారిన పడుతున్నారు. ఇటీవల క్లౌడ్స్ మాదాపూర్‌లో జరిగిన రేవ్ పార్టీలో 15 మంది యువత పట్టుబడ్డారు. గత నెలలో పలు ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు డ్రగ్స్, గంజాయి కేసుల్లో పోలీసులకు చిక్కారు. పిల్లల దినచర్యపై తల్లిదండ్రులు దృష్టి ఉంచాలి.
కొత్తదనాన్ని ఆస్వాదించాలనే ఉత్సుకత
నేటి యువతలో కొత్తదనాన్ని ఆస్వాదించాలనే ఉత్సుకత పెరుగుతోంది. పిల్లల్లో టీనేజ్ దశలోనే అడల్ట్ బిహేవియర్ మొదలవుతోంది. మత్తు పదార్థాలు మనిషిని ‘ఇఫోరిక్’ స్టేజిలోకి తీసుకెళ్తాయి. తక్కువ ధరకే దొరుకుతన్న గంజాయికి అలవాటు పడుతున్నారు. మధ్యతరగతి వారూ డ్రగ్స్‌కు అలవాటవుతున్న సందర్భాలు ఉన్నాయి. మత్తు పదార్థాల బారిన పడ్డ వారికి ఉపశమనం కలిగించే వైద్యం కూడా ఉంది.
డా. సీ వెంకటసుబ్బయ్య, క్లినికల్ సైకాలజిస్ట్,
ఎర్రగడ్డ మానసిక వైద్యశాల
పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం..
నగరంలో 15 మంది గంజాయి బడా వ్యాపారస్తులు ఉన్నట్లు గుర్తించాం. వారిలో నలుగురిని అరెస్టు చేశాం. మిగతావారిని కూడా అరెస్ట్ చేస్తాం. గంజాయి విక్రేతలపై పీడీయాక్టు ప్రయోగిస్తాం. ఎక్కువ మంది సరదాకోసం డ్రగ్స్ తీసుకుని వ్యసనపరులుగా మారుతున్నారు. భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. పలువురు ఈజీ మనీ కోసం విక్రేతలుగా మారుతున్నారు. డ్రగ్స్, గంజాయి అమ్మడం, కొనడం నేరమే. డ్రగ్స్, గంజాయి కేసుల్లో దొరికే వారెవరైనా.. నేరం రుజువైతే ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. డ్రగ్స్, గంజాయి విక్రయిస్తూ పట్టుబడే వారికి 20 ఏళ్ల వరకు శిక్ష పడొచ్చు. కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్.