మహబూబాబాద్,(విజయక్రాంతి): గూడూరు మండలంలోని మచ్చర్ల వద్ద రెండు కార్లలో తరలిస్తున్న 187 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకు న్నట్లు మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. కార్లు సీజ్ చేసి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. గూడూరు పోలీసులకు ఎండు గంజాయి గూడూరు మీదుగా హైదరాబాద్ కు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో నర్సంపేట- మహబూబాబాద్ 365 జాతీయ రహదారి మచ్చర్ల స్టేజీవద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.
అటువైపుగా వస్తున్న రెండు కార్లను ఆపి తనిఖీ చేయగా, అందులో 187 కిలోల ఎండు గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన మల్కనగిరి జిల్లా కలిమెల మండలం పులిమేటలకు చెందిన మండల నరేష్, ఇదే జిల్లాకు చెందిన బాపన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుమ్హర్రాస్కు చెందిన రాహుల్ మజుందార్, ఇదే రాష్ట్రానికి చెందిన రాయ్పూర్ జిల్లా ఖేదురంకు చెందిన హరీష్ యాదవ్ ముఠాగా ఏర్పడి గంజాయిని తరలిస్తున్నారు అని తెలిపారు. ఒడిస్సా నుంచి భద్రాచలం, ఇల్లందు, మీదుగా మహబూబాబాద్, గూడూరు నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న క్రమంలో పక్కాసమాచారం మేరకు గూడూరు పోలీసులు మచ్చర్ల స్టేజీ వద్ద వాహనాల తనిఖీలో పట్టుకున్నట్లు చెప్పారు.
గంజాయి విలువ సుమారు రూ.46,76,000 ఉంటుందని తెలిపారు. గంజాయి తరలిస్తున్న వారిలో మండల నరేష్, రాహుల్ మజుందార్, హరీష్ యాదవ్ ను అదుపులోకి తీసుకోగా బాపన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు వివరించారు. వారి వద్ద నుంచి మూడు సెల్ పోన్ల ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కోన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి పెద్దమొత్తంలో గంజాయిని పట్టుకున్న గూడూరు సీఐ కోట బాబురావు, ఎస్సై గిరిధర్ రెడ్డి, సిబ్బంది బిచ్యానాయక్, కుమారస్వామి, రాజేష్ ప్రణీత్, అమృలను డీఎస్పీ తిరుపతిరావు అభినందించారు.