calender_icon.png 16 April, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏబీపీ డెల్టా ర్యాంకింగ్‌లో దేశంలోనే ‘గంగారం’ ఫస్ట్

16-04-2025 01:49:33 AM

రెండో స్థానంలో కన్నాయి గూడెం.. మంత్రి సీతక్క హర్షం 

మహబూబాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): దేశంలోనీ ఆకాంక్షిత (ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం ) ఏబీపీ మండలాల డెల్టా ర్యాంకింగ్ లో తెలంగాణ రాష్ట్రంలోని  మహబూబాబాద్ జిల్లా, గంగారం మండలం అగ్రస్థానంలో నిలవగా,  ములుగు జిల్లా, కన్నాయిగూడెం మండలం రెండవ స్థానంలో నిలిచిందని ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం అధికారి శ్రీనాథ్ హల్కే తెలిపారు. ఏబీపీ ర్యాంకింగ్ లో మహబూబాబాద్, ములుగు జిల్లాలు చోటు దక్కించుకోవడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.

తాజాగా నీతి అయోగ్ ర్యాంకింగ్ లో మహబూబాబాద్ జిల్లా గంగారం బ్లాక్ మొదటి స్థానం సాధించిందని పేర్కొన్నారు. సామాజిక ఫలితాలు, అభివృద్ధిని పెంపొందించడంలో జిల్లాలోని అన్ని శాఖలు సమన్వయంతో కలిసి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచనల మేరకు క్షేత్రస్థాయిలో ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, సామాజిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయ, వ్యవసాయేతర అభివృద్ధి, ఐదు విభాగాల్లో 40 సూచికల ద్వారా  లోపాలను గుర్తించి మెరుగుపరచడానికి అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పనిచేయడం వలన ఈ విజయం సాధించినట్లు పేర్కొన్నారు.

ఆస్పిరేషనల్  బ్లాక్ ప్రోగ్రాంలో శ్రేష్టత కోసం ప్రయత్నించడం, కొనసాగించడానికి అందరికీ ప్రేరణగా ఉంటుందని, భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించడానికి అందరి సహకారంతో సాధ్యం అయ్యిందని శ్రీనాథ్ తెలిపారు. రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడుతూ నీతి ఆయోగ్ ప్రకటించిన డిసెంబర్ 3వ త్రైమాసిక ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ఏబీపీ) డెల్టా ర్యాంకింగ్స్లో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని గంగారం బ్లాక్ అగ్రస్థానంలో నిలిచింది.

భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందని బ్లాక్లలో పాలనను మెరుగుపరచడం, జీవన నాణ్యతను పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యమని, ర్యాంకింగ్ బ్లాక్ల పనితీరు, సూచికల పై పురోగతిపై ఆధారపడి ఉంటుందని, పోటీతత్వం, సహకార సమాఖ్యవాదాన్ని ప్రోత్సహించడంలో ర్యాంకింగ్ కీలకమైన భాగమన్నారు. మహబూబాబాద్ ములుగు జిల్లా సంబంధిత శాఖల అధికారులు మరింత ఉత్సాహంతో పనిచేసి క్షేత్రస్థాయిలో అభివృద్ధికి దోహదపడాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.