calender_icon.png 1 April, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎగిరి దూకిన గంగమ్మ!

28-03-2025 01:49:46 AM

  • ఎట్టకేలకు దేవన్నపేట వద్ద దేవాదుల పంపు ఆన్..
  • మరమ్మతుల అనంతరం ట్రయల్ రన్..
  • ధర్మసాగర్ రిజర్వాయర్‌కు నీళ్లు వదిలిన అధికారులు
  • జనగామ జిల్లాలో 60 వేల ఎకరాలకు అందనున్న సాగునీరు

జనగామ, మార్చి 27(విజయక్రాంతి): దేవాదుల ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటి కోజం రైతులు ఎన్నో రోజులుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. దేవన్నపేట పంపుహౌజ్ నుంచి నీళ్లు వస్తే తమ పంటలను కాపాడుకోవచ్చ ఆశతో వేచి ఉన్న అన్నదాతలకు శుభవార్త అందింది. కొన్ని రోజుల క్రితమే ఇక్కడి నుంచి మోటార్ ఆన్ చేసి ఒక పంపు ద్వారా నీటిని అందించాలని ప్రభుత్వం ప్రయత్నించగా.. సాంకేతిక సమస్యలతో ఆలస్యమైంది.

కానీ ఈ ప్రాజెక్టుపై ఆధారపడ్డ ప్రాంతాల్లో భీకర కరువు పరిస్థితులు రావడంతో ప్రభుత్వం యుద్ధప్రాతిదక చర్యలు చేపట్టింది. సాంకేతిక సమస్యలను సరిచేసి ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. బుధవారం అర్ధరాత్రి వారు నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి నీరు చేరింది. 

పది రోజుల పాటు శ్రమించిన అధికారులు..

ఈ నెల 18న దేవన్నపేట పంప్ హౌజ్ వద్ద పంపు లిఫ్టింగ్ పనులను ప్రారంభించేందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వచ్చారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో మోటార్లు పనిచేయలేదు. దీంతో వెంటనే టెక్నీషియన్లను పిలిపించారు. అప్పటి నుంచి మోటారు మరమ్మతు పనులు చేపడుతుండగా బుధవారం సాయంత్రం వరకు పనులన్నీ పూర్తయ్యాయి.

దీంతో అధికారులు ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేయగా మొదట్లో మళ్లీ మోటార్  సతాయించింది. అధికారులు, ఇంజినీర్లు అర్ధరాత్రి వరకు శ్రమించి సుమారు 2 గంటల సమయంలో మోటార్‌ను ఆన్ చేశారు. దేవన్నపేట పంప్ హౌజ్ నుంచి దాదాపు ఆరున్నర కిలోమీటర్ల పైపులైన్ ద్వారా నీళ్లు ధర్మసాగర్ రిజర్వాయర్ కు చేరుకున్నాయి. 

జనగామ జిల్లాలో 60 వేల ఎకరాలకు..

దేవాదుల మూడో ఫేజ్‌లో భాగంగా రామప్ప చెరువు నుంచి దేవన్నపేట వద్ద పంప్ హౌజ్ వరకు రూ.1,494 కోట్లతో 49.06 కిలోమీటర్ల వరకు టన్నెల్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఒక మోటార్ ద్వారా నీటి పంపింగ్‌ను ప్రారంభించడంతో ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి నీరు వెళ్తుంది.

ఇక్కడి నుంచి జనగామ జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు నీరు అందనుంది. రిజర్వాయర్లను, ట్యాంకులను నింపి జిల్లాలోని అన్ని గ్రామాలకు నీరు అందించనున్నారు. మొత్తంగా ఈ పంపు లిఫ్టింగ్ వల్ల జనగామ జిల్లాలోని సుమారు 60 వేల ఎకరాలకు నీరు అందనున్నట్లు అధికారులు వెల్లడించారు.