calender_icon.png 23 January, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణా బేసిన్‌లో గంగమ్మ గలగలలు !

26-08-2024 03:19:12 AM

జలాశయాలకు పోటెత్తుతున్న వరద

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): ఆల్మట్టి నుంచి ఆదివారం లక్ష క్యూసెక్కుల వరద నారాయణపూర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. నారాయణపూర్ నుంచీ జూరాలకు 66,270 క్యూసెక్కుల వరద చేరింది. కృష్ణానది భీమా నుంచి 36 వేల క్యూసెక్కుల వరద దిగువ వెళ్లింది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 48 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.5050 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589 అడుగులు (311.74 టీఎంసీలు) గా ఉంది.

ఆదివారం ఉదయం 65 వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు అధికారులు రెండు క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత వరద తగ్గడంతో గేట్లను మూసేశారు. కుడి కాల్వకు 9,076 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,367 క్యూసెక్కులు, ఎస్సెల్బీసీ (ఏఎమ్మార్పీ)కి 1800 క్యూసెక్కులు, లో లెవల్ కెనాల్‌కు 600 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ 28,867 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌లోకి 48,710 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. అంతే మొత్తంలో అవుట్ ఫ్లో కొనసాగుతున్నది.

‘శ్రీరాంసాగర్’లోకి వరద

ఉత్తర తెలంగాణ వరదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద తాకిడి పెరిగింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 34,952 క్యూస్సెక్కుల వరద చేరుతున్నది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ప్రాజెక్ట్‌లోకి 55.192 టీఎంసీల వరద వచ్చి చేరింది. ప్రాజెక్ట్ నుంచి దిగువకు 9.428 టీఎంసీల నీరు బయటకు వెళ్లింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వసామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 54.62 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువకు 3,000 క్యూస్సెక్కులు, లక్ష్మీకాలువకు క్యూస్సెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూస్సెక్కులు విడుదలయ్యాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడానికి మరో 25.88 టీఎంసీల నీరు అవసరం ఉంది. అలాగే కుమ్రం భీం ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతున్నది. దీంతో దిగువకు జలాలు వదులుతున్నారు. కుమ్రం భీం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 784 క్యుసెక్యులు వట్టివాగు ప్రాజెక్టు రెండు గేట్లు  ఎత్తి  నీటిని దిగువకు వదులుతున్నారు.