calender_icon.png 26 November, 2024 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగమ్మ చెంతకు గౌరమ్మ

09-10-2024 12:00:00 AM

వేములవాడలో సద్దుల బతుకమ్మ

హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కరీంనగర్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఏడు రోజులకే వేములవాడలో బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.

తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు ఆడిపాడారు. ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై తిలకించారు. కలెక్టర్ సందీప్‌కు మార్, ఎస్పీ అఖిల్ మహజన్, కమిషనర్ సంపత్‌రెడ్డి, జన నాట్యమండలి అధ్యక్షురాలు విమలక్క, కూడా హాజరయ్యారు. రాత్రి మూలవాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

వేములవాడ నగర వీధులు విద్యుద్దీపాలంకరణతో విరాజిల్లాయి. మున్సిపల్ పాలకవర్గం రూ.25 లక్షలు వెచ్చించి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జననాట్యమండలి అధ్యక్షురాలు విమలక్క, మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి బతుకమ్మ ఆడారు. విమలక్క బతుకమ్మ పాటలకు మహిళలు కోరస్ కలిపారు. 

ఏడు రోజులకే ఎందుకు?

పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని పాలించే ఒక రాజుకు కుమార్తె అంటే ఎనలేని ప్రేమ. ఆమెను వేములవాడ ప్రాంతానికి తీసుకువచ్చి పెళ్లి జరిపించాడు. ఆ తర్వాత బతుకమ్మ పండుగ రావడంతో అల్లుడిని ఇంటికి రమ్మని రాజు ఆహ్వానించాడు. అయితే వేములవాడలో కూడా బతుకమ్మ ఉంటుంది కదా, ఇక్కడ ఆడకుండా పుట్టింటికి ఎలా రాగలనని రాజు కూతురు అడిగింది. దీంతో రాజు వేములవాడ ప్రాంతంలోని కోడళ్లంతా ఏడు రోజులకే బతుకమ్మ జరుపాలని, మిగతా రెండు రోజులు పుట్టింట్లో వేడుకలు జరుపుకోవాలని శాసనం చేసినట్లు చెబుతుంటారు. 

అమెరికాలో బతుకమ్మ సంబురాలు 

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): గ్లోబల్ తెలంగాణ అసోషియేషన్ ఆధ్వర్యంలో అమెరికాలోని ఫార్మింగ్టన్ హిల్స్‌లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు సంబవాంగ్ పార్క్‌లో కన్నుల పండవగా నిర్వహించారు. ఈ సంబురాల్లో పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.