14-04-2025 01:31:29 AM
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): వేసవి అంటేనే నీటి కష్టాలు.. బోర్లలో నీటి లభ్యత లేకపోవడంతో ప్రజ లు ఇబ్బందులు పడటం ఏటా సాధారణమైపోయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూగర్భజలాలు నానాటికీ అడుగంటిపోతున్నాయి. కాంక్రీట్ జంగిల్‌లా మారుతున్న నగరంలో నీటిని ఒడిసి పట్టే వ్యవస్థే లేకపోవడంతో వాన నీటిని సద్వినియోగం చేసుకునే పరిస్థితే లేకుండా పోయింది.
దీంతో భూగర్భజలాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఎండలు మండుతున్న కొద్దీ భూగర్భజలాలు మరింత లోలోపలికి వెళ్లిపోతున్నాయి. గత రెండు నెలల వ్యవధిలోనే నగరంలో దాదాపుగా 10 నుంచి 22 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. అమీర్‌పేట, శేరిలింగంపల్లి, సరూర్‌నగర్, మారేడ్‌పల్లి మండలాలు సహా నగరంలోని శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.
నదుల్లో నీటి లభ్యత క్రమేపీ తగ్గిపోవడంతో జలమండలి నుంచి విడుదల చేసే నీళ్లు కూడా ప్రజలకు సరిపడ అందడంలేదు. వర్షాకాలంలో ఆశాజనకంగానే కనిపించే భూగర్భజలాలు వర్షాలు వేసవి ప్రారంభం కాకముందే తగ్గుముఖం పడుతున్నాయి. వేసవి ప్రారంభం అయ్యిం దంటే చాలు అందనంత లోతుకు అన్న రీతిలో పరిస్థితి మారిపోతోంది. ఈ నెలలో నగరంలో దాదాపు 10 నుంచి 24 మీటర్ల లోతుకు భూగర్భజలాలు దిగువనకు వెళ్లిపోయాయి.
శివారుల్లోనే అధిక సమస్య
గతేడాది మార్చిలో 6.66 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు ఈ ఏడా ది మార్చిలో ఏకంగా 38.19 మీటర్ల దిగువనకు వెళ్లిపోయాయి. ఏడాదిలో 31.53 మీటర్ల మేర తేడా కనిపిస్తోంది. నగరంలోనే ఇదే అత్యధిక క్షీణత. అయితే చాలా చోట్ల కూడా క్రమంగా భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి.
ఈ ఏడాది నగరం నడిబొడ్డున ఉన్న ప్రాంతాల కంటే శివారు ప్రాంతాల్లోనే భూగర్భ జలాలు త్వరగా లోలోపలికి ఇంకడాన్ని గమనించామని భూగర్భ జల శాఖ అధికారులు చెబుతున్నారు. చెరువులు, కుంటలను కూడా వదిలిపెట్టకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా శివార్లలో ఈ దుస్థితి తలెత్తుతోంది.
ప్రజల్లో నీటిని పొదుపుగా వాడుకుందామని ఆలోచన లేకపోవడంతో పాటు వర్షపు నీటి సంరక్షణలో ప్రజలు, ప్రభుత్వాలు వైఫల్యం చెందడమూ ఓ కారణమని సామాజికవేత్తలు అంటున్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ పట్ల ప్రజల్లో నానాటికీ తగ్గిపోయిన బాధ్యత కూడా భూగర్భజలాలు అడుగంటేందుకు ఓ కారణంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ అధికారి బలరాం ‘విజయక్రాంతి’కి తెలిపారు.
నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసుకుంటేనే భూగర్భజలాలు భవిష్యత్తు తరాలకు అందుతాయని లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోక తప్పదని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో నీరు కూడ ఓ ఖరీదైన వనరుగా మారిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.
మార్చిలో గ్రేటర్ పరిధిలో
భూగర్భజలాలు(మీటర్ల లోతులో)
శేరిలింగంపల్లి 23.72
అమీర్‌పేట 20.37
సరూర్‌నగర్ 19.78
మారేడ్‌పల్లి 19.44
తిరుమలగిరి 17.22
బండ్లగూడ 15.37
ఆసిఫ్‌నగర్ 14.90
మహేశ్వరం 13.89
హయత్‌నగర్ 13.88
గండిపేట 10.13
అబ్దుల్లాపూర్‌మెట్ 7.73
ముషీరాబాద్ 7.23