calender_icon.png 24 October, 2024 | 3:58 AM

గంగారెడ్డి హత్యతో రాజకీయ ప్రకంపనలు

24-10-2024 01:25:20 AM

  1. ముఖ్యమంత్రి రేవంత్ ఆరా
  2. రంగంలోకి ఇంటెలిజెన్స్

కరీంనగర్, అక్టోబరు 23 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో మంగళవారం జరిగిన గంగారెడ్డి హత్య కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. హతుడు గంగారెడ్డి, హంతకుడు సంతోష్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కావడంతో ఇది ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ల మధ్య వార్‌గా మారింది.

ఈ హత్య వ్యక్తిగత కక్ష అని భావిస్తున్నా రాజకీయరంగు పులుముకుంది. గంగారెడ్డి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు కావడం, ఆయనను జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌కు కూడా జీవన్‌రెడ్డి ప్రతిపాదించడం, ఈ సమయంలోనే హత్యకు గురికావడం కలకలం రేపింది. 

గంగారెడ్డికి హెచ్చరికలు..

గంగారెడ్డిపై సంతోష్ చాలారోజుల నుం చి కక్ష పెంచుకున్నట్లు తెలుస్తుంది. గంగారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా, మాజీ సర్పంచ్‌గా జాబితాపూర్‌లో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుని పలు సెటిల్‌మెంట్లు సైతం చేస్తుండేవారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సంతోష్ పెద్దనాన్న అయిన ముత్తయ్య వైపు ఉండి సంతోష్ తండ్రి అయి న లచ్చయ్యకు చెందిన భూ వివాదంలో తలదూర్చడం, ముత్తయ్యవైపు ఉన్నారు.

అదే విధంగా సంతోష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, గంజాయి కేసులు  నమోదు కావడం, భూమి వివాదంలో గంగారెడ్డి హస్తం ఉంద ని కక్ష పెంచుకున్న సంతోష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. దసరా పర్వదినం రోజు సంతోష్ గ్రామంలో డీజేతో వేడుకలు జరుపుకుంటున్న వారిని అడ్డుకోవడం, దసరా అనంతరం గంగారెడ్డికి హెచ్చరికలతో కూడిన మెసెజ్‌లు పంపడం జరిగిందని గంగారెడ్డి కుటుంబ సభ్యులేకాక జీవన్ రెడ్డి ఆరోపించారు.

గంగారెడ్డిని హతమార్చాలని మెసెజ్‌లు పెట్టినా, గంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని గంగారెడ్డి కుటుంబసభ్యులు ఆరోపి స్తున్నారు. జీవన్ రెడ్డి కూడా ఈవైపుగా మాట్లాడడం అధికార పార్టీలో ఉండి అనుచరుడు హత్యకు గురికావడంతో మంగళ వారం ఆయన ఉద్వేగంతో పార్టీపైన అసహనం వ్యక్తం చేసి పార్టీలో ఉండడమెందుకు అని మాట్లాడడం ప్రకంపనలు సృష్టించింది. 

సీఎం రేవంత్‌రెడ్డి ఆరా..

బుధవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీధర్‌బాబు జగిత్యాల ఘటనను సీరియస్‌గా తీసుకుంటామని, నిందితులు ఎంతటి వారైనా, ఎవరి సహకారం ఉన్నా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. పార్టీలో జీవన్‌రెడ్డి సీనియర్ నాయకుడని అన్నారు. అయితే ఈ హత్య సంఘటనపై సీఎం రేవం త్ రెడ్డి ఆరా తీయడం, జగిత్యాల ఎస్పీతో డీజీపీ మాట్లాడి అధికారుల వైఫల్యంపై ఆగ్ర హం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ హత్య ఘట నపై ఆరా తీస్తుండడంతో ఇది ఎటు దారితీస్తుందోనని చర్చ మొదలయింది. 

మొదట బీఆర్‌ఎస్.. ఆ తర్వాత కాంగ్రెస్

జాబితాపూర్‌కు చెందిన సంతోష్ మొద ట బీఆర్‌ఎస్‌లో ఉన్నాడు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ఆయన కూడా చేరారు. సంజయ్ చేరికను అప్పట్లో ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన అలక వహించడం తో అధిష్టానం పిలిపించుకుని బుజ్జగించింది. సంజయ్ పార్టీలో చేరిన అనంతరం కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది.

సంతోష్ కాంగ్రెస్‌లో చేరినా జాబితాపూర్ లో గంగారెడ్డితో వైరంగా ఉండేవాడు. జగిత్యాలలో జీవన్‌రెడ్డి,  సంజయ్ గ్రూపులుగా కార్యకర్తలు, నేతలు విడిపోయారు. గంగారెడ్డి హత్య వెనుక వ్యక్తిగత కారణాలు ప్రధానమైనప్పటికీ సంతోష్ ఈ ఘాతుకానికి పాల్పడ డం వెనుక రాజకీయ నేతల అభయం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 

పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలి: జీవన్ రెడ్డి

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిపై వేటు వేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ విధి విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని అన్నారు. ఫిరాయింపులపై తన నిర్ణయం మారదని తేల్చి చెప్పారు. తన అనుభవం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.

తెలంగాణలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉందని, ఎంఐఎంను మినహాయించినా స్పష్టమైన మెజార్టీ ఉందని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తాను నాలుగు నెలలుగా అవమనాలకు గురవుతున్నట్లుగా తెలిపారు.

తాను కూడా ఒక కాంగ్రెస్ నేత అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందన్నారు. తాను చేసేది మొత్తం అధిష్టానానికి చెప్పానని, తర్వాత అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదని వ్యాఖ్యానించారు. తన ముఖ్య అనుచరుడు  గంగారెడ్డి హత్యకు గురికావడంతో బుధవారం మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు. 

మాది మొదట కాంగ్రెస్ పార్టీయే:  ఎమ్మెల్యే సంజయ్

సుదీర్ఘకాలంగా రాజకీయంలో ఉన్న తమ కుటుంబం మొదట కాంగ్రెస్ పార్టీయేనని, ఆ తర్వాతే జీవన్‌రెడ్డి వచ్చారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు. తాను కేవలం నియోజకవర్గ అభివృద్ధి ఆశించి కాంగ్రెస్‌లో చేరానని, ఇప్పటికీ కూడా తాను బీఆర్‌ఎస్‌కి రాజీనామా చేయలేదని తెలిపారు.

కాంగ్రెస్ సభ్యత్వం తీసుకో లేదని స్పష్టంచేశారు. కొందరు ఈ హత్యను రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని,  ఈ హత్యతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు.  ఈ హత్య ఏ కారణంగా జరిగిందో పోలీసుల విచారణలో తేలుతుందని, ఈ హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.