01-05-2024 12:05:00 AM
తప్పించుకునేందుకు సినీఫక్కీ దొంగల ముఠా యత్నం
వెంబడించి పట్టుకున్న పోలీసులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: డబ్బులు దొంగిలించి పారిపోతున్న ఓ ముఠా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేసింది. రోడ్డుపై నోట్లు వెదజల్లి పోలీసులకు చిక్కకుండా పారిపోయేందుకు యత్నించింది. కానీ అన్ని వైపులా ముట్టడించిన పోలీసులు ముఠాను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. రాజీవ్ సింగ్ అనే వ్యక్తి కరోల్ బాగ్‌లోని ఓ దుకాణంలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 28న తన యజమాని రూ.4.5 లక్షలు ఇచ్చి రెండు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులకు డెలివరీ చేయాల్సిందిగా రాజీవ్ సింగ్‌కు సూచించాడు. దీంతో ఆయన తొలుత ఒకచోట రూ.2.5 లక్షలు ఇచ్చేసి తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి జీల్ చౌక్ వెళ్లి మరో వ్యక్తికి డబ్బులు ఇవ్వాల్సి ఉండడంతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వాహనాల కోసం ఎదురుచూస్తున్నాడు.
రిక్షాలో మాటు వేసి..
ఓ రిక్షా డ్రైవర్ రాజీవ్ సింగ్ వద్దకు వచ్చి తాను జీల్ చౌక్ వైపే వెళ్తున్నానని చెప్పడంతో అందులో ఎక్కాడు. ఆ వాహనంలో అప్పటికే ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. కొంతదూరం వెళ్లగానే వారు రాజీవ్ సింగ్ నుంచి బ్యాగును లాక్కొని నడుస్తున్న వాహనం నుంచే అతడిని తోసేశారు. వెంటనే పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌కు విషయం చెప్పాడు. కానిస్టేబుల్ విషయాన్ని పైఅధికారులకు తెలిపాడు. దీంతో వారు నిందితులు వెళ్తున్న ప్రాంతం వైపు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నారు. మరో హెడ్ కానిస్టేబుల్‌ను తీసుకొని కానిస్టేబుల్ రాజ్‌కుమార్ బైక్‌పై నిందితులను వెంబడించారు. పోలీసులను గుర్తించిన నిందితులు తప్పించు కునేందుకు ప్లాన్ వేశారు. రోడ్డుపై రూ.25 వేల నోట్లను వెదజల్లారు. ఇదే సమయంలో నిందితులు మిగిలిన నగదుతో సమీప పొలాల్లోకి పారిపోయారు. కానిస్టేబుళ్లు, అధికారులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.1.75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.