08-03-2025 11:34:08 PM
కర్ణాటకలోని హంపి సమీపంలో ఘటన
బెంగళూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. హంపి అందాలను చూసేందుకు వచ్చిన ఇద్దరు యువతులపై ముగ్గురు నిందితులు అత్యాచారానికి పాల్పడడం సంచలనం రేపింది. బెంగళూరుకు 350 కిమీ దూరంలో ఉన్న కొప్పాల్‌లోని తుంగభద్ర నది ఎడమ కెనాల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇజ్రాయెల్‌కు చెందిన మహిళా టూరిస్ట్ (27) కర్ణాటకలోని హంపి ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చింది. హంపి ప్రాంతంలోనే ఒక ఇంట్లో అద్దెకు దిగింది.
గురువారం రాత్రి సదరు టూరిస్ట్ మహిళ ఆమె అద్దెకు దిగిన ఇంటి ఓనర్‌తో కలిసి హంపి సందర్శనకు వెళ్లారు. మార్గ మధ్యలో హంపికి నాలుగు కిమీ దూరంలో ఉన్న సనాపూర్ చెరువు వద్దకు రాగానే ముగ్గురు దుండగులు బైక్ వచ్చి వారిని అడ్డుకున్నారు. పెట్రోల్‌కు రూ. వంద కావాలని అడిగారు. తమ వద్ద డబ్బులు లేవని సమాధానం చెప్పడంతో దుండగులు దాడికి దిగారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. దాడికి పాల్పడిన దుండగులు అనంతరం వారిని కెనాల్‌లోకి తోసేశారు. అనంతరం ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడి డబ్బు, బంగారం లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.
కాగా కెనాల్‌లో పడిపోయిన వారిలో అమెరికాకు చెందిన డేనియల్, మహారాష్ట్రకు చెందిన పంకజ్ ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరగా.. ఒడిశాకు చెందిన బిబాష్ మాత్రం నీటిలో మునిగిపోవడంతో శనివారం ఉదయం శవంగా ఒడ్డుకు కొట్టుకురావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై దొంగతనం, అత్యాచారం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.