- విద్యుత్ కేబుల్స్, ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ వైర్ చోరీ
- నిందితుల నుంచి రూ.35 లక్షల సొత్తు స్వాధీనం
యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు 23 (విజయక్రాంతి): మారుమూల ప్రాంతాల్లోని విద్యుత్ స్తంభాలపై అల్యూమినియం కేబుల్ వైర్, ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్ చోరీలకు పాల్పడుతున్న బీహార్, జార్ఖండ్‌కు చెం దిన ఎనిమిది మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠా ను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి జోన్ పోలీసులు సోమవా రం అరెస్టు చేశారు. వీరు జిల్లా వ్యాప్తంగా 46 దొంగతనాలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి చోరీకి ఉపయోగించిన వాహనాలు, పరికరాలతో పాటు నగదుతో పాటు దాదా పు రూ.35 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
యాదాద్రి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్, జార్ఖండ్‌కు చెందిన బిక్రమ్‌కుమార్ సింగ్, మహేందర్‌రాం, రామ్‌కుమా ర్ సింగ్, గోవింద్ మండల్, శ్రవణ్ మటో, ప్రదీప్‌కుమార్, రాజ్‌కుమార్ రాయ్, అమిత్ జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబా ద్ నగరానికి వచ్చారు. అనేక రకాల పనులు చేస్తూ జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో నివా సం ఉంటున్నారు. వీరు సులువుగా డబ్బు సంపాదించడానికి కొంతకాలం నుంచి విద్యుత్తు కేబుళ్ల చోరీకి పాల్పడటం ప్రారంభించారు. చోరీల్లో బిక్రమ్‌కుమార్ సింగ్ సూత్రాధారిగా వ్యవహరిస్తున్నాడు. ముఠా ముందుగా మారుమూల ప్రాంతాలను ఎంచుకుంటుం ది.
తర్వాత రాత్రిళ్లు అక్కడికి చేరుకుని విద్యు త్తు స్తంభాలపై అల్యూమినియం కేబుళ్లు, ట్రాన్స్‌ఫార్మర్లను పగులకొట్టి అందులోని కాపర్ వైర్ అపహరిస్తుంది. తర్వాత చోరీ చేసిన వాటిని జీడిమెట్లలోని స్క్రాప్ వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటుంది. సోమవారం ఉదయం బొమ్మల రామారం పోలీసులు వాహన తనిఖీ చేపడుతుండగా ఆ ప్రాంతంలో ఎనిమిది మంది అనుమానాస్పదంగా కనిపించారు. నిందితులను తనిఖీ చేయగా భారీగా విద్యుత్తు వైర్ పట్టిబడింది. పోలీసులు నిందితుల నుంచి 200 కిలోల కాపర్ వైర్, రూ.2.73 లక్షల నగదుతో పాటు మూడు వాహనాలు, ఎనిమిది మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.