calender_icon.png 11 October, 2024 | 8:45 AM

అంతర్రాష్ట్ర మేకల దొంగల ముఠా అరెస్టు

04-09-2024 12:17:59 AM

మెదక్, సెప్టెంబర్ 3(విజయక్రాంతి): వరుసగా మేకల దొంగతనానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి తెలిపారు. మూడు జిల్లాల్లో భారీ ఎత్తున మేకల దొంగతనం చేసిన ఈ ముఠా పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేస్తూ పట్టుబడినట్లు తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. ఈ ముఠా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొత్తం 16 దొంగతనాలు చేశారని, వందకు పైగా మేకలను దొంగిలించినట్లు తెలిపారు. మేకలను అమ్మగా వచ్చిన డబ్బులతో గొర్రెలను కొని తిరిగి వాటిని అమ్మిగా వచ్చిన డబ్బుల జల్సాలు చేసేవారని ఎస్పీ తెలిపారు.

మొత్తం 11 మంది ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని.. మంగళవార ముఠాలోని ఆరుగురిని అరెస్టు చేశామని.. వారిలో ముస్లాపూర్ గ్రామానికి చెందిన చిన్న కటికె ఖదీర్ పాష, ఇప్ప మహేందర్, గడ్డిపెద్దాపూర్‌కు చెందిన ఎరుకల గోపాల్, ఎరుకల అనిల్, మెల్ల అనిల్‌కుమార్, సంగారెడ్డికి చెందిన మహ్మద్ సాహిద్ ఉన్నారు. వీరినుండి రూ.4లక్షల 71వేల నగదును, 9 మేకలను స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఐదుగురు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు.