రూ.10 లక్షల విలువైన కాపర్ స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లో రాత్రిపూట కాపర్ కేబుల్ వైర్లు చోరీ చేస్తున్న ముఠాను నార్త్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేసి వారినుంచి రూ.10 లక్షల విలువైన కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపిన వివరాలు.. రాత్రి సమయంలో కంపెనీ ప్రతినిధులుగా వ్యవహరిస్తూ కేబుల్ వైర్ మరమ్మతుల పేరుతో ఓ ముఠా సికింద్రాబాద్ పరిధిలో కేబుల్ వైర్లు దొంగలిస్తోందని తెలిపారు.
ఈ విషయమై బీఎస్‌ఎన్‌ఎల్ అధికారుల ఫిర్యాదుతో బోయిన్‌పల్లి పోలీసులు విచారణ చేపట్టగా.. సికింద్రాబాద్ పరిధిలో నాలుగు చోట్ల కాపర్ కేబుల్ వైర్లు చోరీకు గురైనట్లు గుర్తించారు. చోరీ జరిగిన ప్రాంతాల్లోని సుమారు 200 సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఫుటేజీ ఆధారంగా పోలీసులు.. సోమ వారం మొత్తం 14 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు.
పలు కంపెనీల నుంచి కేబుల్స్ ఇన్‌స్టాల్ చేసే కాంట్రాక్ట్ లేబర్స్.. ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎక్కడెక్కడ అయితే ఇన్‌స్టాల్ చేశారో ఆయా ప్రాంతాల్లో కాపర్ వైర్లను దొంగలించి అమ్మకాలు జరుపుతున్న ట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి రూ.10 లక్షల విలువైన కాపర్ కేబుల్ వైర్లు, ఒక ఆటో, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నా రు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. నిందితులను కోర్టులో హాజ రుపరిచి రిమాండ్‌కు తరలించారు.