calender_icon.png 4 January, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్టు

01-01-2025 02:08:32 AM

  1. సిరిసిల్ల పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు
  2. నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు, ఇతర సామగ్రి స్వాధీనం

సిరిసిల్ల, డిసెంబర్ 31 (విజయక్రాంతి): నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం రాత్రి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

సిరిసిల్ల పట్టణ పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సిరిపురం చంద్రమౌళి, సాయినగర్‌కు చెందిన ప్రింటింగ్ ప్రెస్ వర్కర్ పోలు ప్రకాశ్, శివనగర్‌కు చెందిన డాక్యుమెంట్ రైటర్ శివాజీ, న్యాయవాది  బిట్ల విష్ణు, శీలం రాజేశం, చందుర్తి మండలం అనంతపల్లికి చెందిన చిలుక బాబు ముఠాగా ఏర్పడ్డారు.

బోయినపల్లి తహసీల్దార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి పేరిట నకిలీ సర్టిఫికెట్లు, స్టాంపులు తయారు చేస్తున్నారు. వీఐపీల పేరుతో ప్రభుత్వ ఆఫీసుల నుంచి జారీ చేసే సర్టిఫికెట్లు, కోర్టులో బెయిల్ కోసం షూరిటీగా ఇచ్చే ఆస్తి విలువకు సంబంధించిన సర్టిఫికెట్లు, ప్రభుత్వ స్కూళ్లలో ఇచ్చే బర్త్ సర్టిఫికెట్లు, ఆసుపత్రుల్లో ఇచ్చే మెడికల్ సర్టిఫికెట్లు, కల్యాణ లక్ష్మి పొందడానికి నకిలీ అర్హత పత్రాలు తయారు చేస్తున్నారు.

వాటిని అనర్హులకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పక్కా సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్, టౌన్ పోలీసులు చంద్రమౌళిని అదుపులోకి తీసుకుని విచారించగా ముఠా గుట్టు రట్టయినట్టు ఎస్పీ వివరించారు. చందుర్తి మండలం అనంతపల్లికి చెందిన మాజీ ఉప సర్పంచ్ వీరి వద్ద నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్ పొంది లబ్ధి పొందారని, విష్ణు అనే వ్యక్తి నకిలీ ప్రాపర్టీ వాల్యువేషన్ సర్టిఫికెట్ తీసుకున్నట్టు విచారణలో తేలిందన్నారు.

నిందితుల్లో సిరిపురం చంద్రమౌళి, పోలు ప్రకాష్, శివాజీ, చిలుక బాబు, బిట్ల విష్ణులను అరెస్టు చేసినట్టు తెలిపారు. శీలం రాజేశం పరారీలో ఉన్నాడని ఎస్పీ చెప్పారు. నిందితుల నుంచి నకిలీ డాక్యుమెంట్ల తయారీకి వినియోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ కృష్ణ, టాస్క్‌ఫోర్స్ సీఐ సదన్‌కుమార్ పాల్గొన్నారు.