హైదరాబాద్: నిర్విఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వదా.. అంటూ గణనాథుని భక్తులంతా కొలుచుకునే గణేషుడిని తమ మిత్రుడిలా భావిస్తూ పూజిస్తారు. అలాంటి గణేషుడికి తమ చేతులతో జల విసర్జనం చేయాల్సి రావడంతో ఒకింత బాధతో భక్తుల గుండెలు బరువెక్కాయి. మహిళలు తమ బిడ్డల సంక్షేమాన్ని వేడుతూ వినాయక విగ్రహాలను తమ కోరికలు తీర్చే కొంగు బంగారంగా.. నవ రాత్రులలో నిత్యం పూజలు హోమాలు అభిషేకాలు, ఉండ్రాళ్ల నైవేద్యం అందుకున్న బొజ్జ గణపయ్య ..అనంతరం గంగమ్మ ఒడిలో చేరడానికి సిద్ధం అవుతున్నాడు. తొమ్మిది రోజులుగా పలు నైవేద్యాలు తీర్థ ప్రసాదాలు నివేదించుకుని మంగళ నీరాజనాలతో వక్రతొండుడికి వీడ్కోలు పలికారు. దారి పొడవునా పులిహోర, లడ్డూ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టి భక్తులకు తమ వితరణ శీలతను చాటుకున్నారు. నవ రాత్రుల అనంతరం గంగమ్మ ఒడిలో చేరడానికి లక్షల సంఖ్యలో వినాయక విగ్రహాలు హుసేన్ సాగర్, సరూర్ నగర్, జిల్లెల్ల గూడ తదితర చెరువులకు చేరుకున్నాయి. వివిధ రూపాలను సంతరించుకున్న వినాయక విగ్రహాలు పలు రకాల వాయిద్యాలు మేళ తాళాలు, తీన్ మార్ డ్యాన్స్ లతో గణేషుడి భక్తులు సందడి చేశారు. జంట నగరాలలో అతి భారీ విగ్రహ రూపంలో కొలువు దీరిన ఖైరతాబాద్ మహాగణపతి శోభా యాత్ర సైతం ఘనంగా గంగమ్మ ఒఢిలో చేరడానికి బయలు దేరింది. ఈ నేపథ్యంలో హుసేన్ సాగర్ పరిసరాలలో పటిష్ఠ భద్రత ఏర్పాట్లను చేపట్టారు. ఖైరతాబాద్ నిమజ్జనంలో పాల్గొనటానికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ కు రానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా ఖైరతాబాద్ గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి పర్యవేక్షిస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి 12.30 కి హుసేన్ సాగర్ కు చేరుకున్న అనంతరం 1.30 కి నిమజ్జనం పూర్తి అవుతుందని కమీషనర్ ఆమ్రపాలి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.