కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ప్రజలు పండుగలను మత సామరస్యంతో ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గొడెల్లివాగు వద్ద చేసిన గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, విద్యుత్ శాఖ ఎ. ఈ. సదాశివ్, ఎస్. ఐ. రాజేశ్వర్ లతో కలిసి పరిశీలించారు. వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగలను ప్రజలు సామరస్యంతో సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. వినాయక నవరాత్రులు ముగిసిన తరువాత నిమజ్జనం రోజున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
నిమజ్జనం ప్రాంతానికి వచ్చే వాహనాలు సక్రమంగా వచ్చేందుకు చెట్ల పొదలు తొలగించి రోడ్లపై గుంతలకు మరమ్మత్తులు చేయాలని, నిమజ్జన ప్రాంతంలో క్రేన్ అందుబాటులో ఉంచాలని, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. వినాయక మండపాల వద్ద నిబంధనలను కచ్చితంగా పాటించాలని, సంబంధిత శాఖల సమన్వయంతో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పారిశుధ్యం, విద్యుత్, మున్సిపల్, మండల ప్రజా పరిషత్ సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం సమర్థ సాయి గణేష్ మండలి వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.