calender_icon.png 19 January, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీ తాత చెట్టు మంచి జ్ఞాపకం

18-01-2025 12:00:00 AM

దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతివేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. జనవరి 24న సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా ఈ మూవీ యూనిట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుకమార్ మాట్లాడుతూ.. “సుకృతికి చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే చాలా ఇష్టం. కానీ డైరెక్టర్ పద్మ, ప్రొడ్యూసర్ సింధు సుకృతిని యాక్టింగ్‌కు ఒప్పించారు. ఆమె నటిస్తుందన్న నమ్మకం లేక మొహమాటానికి సినిమా చేయొద్దని చెప్పాను. కానీ యాక్టింగ్ చూసిన తర్వాత షాక్ అయ్యాను. నా కూతురు బాగా చేసిందని చెప్పడానికి ఏమాత్రం సందేహించను. పద్మ, సింధు ఎంతో కష్టపడి పట్టుదలతో సినిమాను పూర్తిచేశారు.

ఈ సినిమా సుకృతి లైఫ్‌లో మంచి జ్ఞాపకంలా మిగిలిపోతుంది. మూడు గంటలు మనుషులను కూర్చొబెట్టి ఎంటర్‌టైన్ చేయగలిగితే ఆ మూడు గంటలు క్రైమ్ తగ్గిపోతుందని భావిస్తాను. ఎంటర్‌టైన్‌మెంటే మేసేజ్‌గా ఫీలవుతున్నాను. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మేసేజ్ ఇచ్చే సినిమా చేయడం అదృష్టం. ‘గాంధీతాత చెట్టు’లో ఈ రెండూ ఉన్నాయి” అన్నారు. తబితా సుకుమార్ మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసిన ప్రతిసారి ఏడుస్తూనే ఉన్నాను.

ఎందుకంటే ఈ సినిమా ఫెస్టివల్స్‌కు వెళితే చాలు అనుకున్నాను. అవార్డులు వచ్చిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేస్తుండటం చూసి విడుదల చేస్తున్నాం’ అన్నారు. డైరెక్టర్ పద్మావతి మాట్లాడుతూ ‘ఒక చెట్టుకు, మనిషికి మధ్య ఉన్న అనుబంధంతో ఈ సినిమా ఉంటుంది.

సుకృతి నటన ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ’ అన్నారు. సుకృతి మాట్లాడుతూ ‘డైరెక్టర్ పద్మ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆమె కోసమే వంద శాతం దృష్టి పెట్టి నటించాను. ఈ సినిమా కోసం నాన్న ఎలాంటి సలహాలూ ఇవ్వలేదు. అందరితో ఎంతో కంఫర్ట్‌గా నటించాను’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నవీన్, రవిశంకర్, సింధు, రీ, ఆనంద్ చక్రపాణి, లావణ్య, భాను ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.