19-04-2025 07:24:42 PM
జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ మండల కో ఆర్డినేటర్ జీడి వీరస్వామి..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: భారతదేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదురొడ్డి పోరాడిన గాంధీ కుటుంబాన్ని బీజేపి అక్రమ కేసులు ఏం చేయలేవని తిమ్మాపురం మాజీ సర్పంచ్, జై బాపు ,జై భీమ్, జై సంవిదాన్ మండల కో-ఆర్డినేటర్ జీడి వీరస్వామి అన్నారు. శనివారం మండల కేంద్రం అర్వపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత పదేళ్ల బీజేపి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనారిటీలకు రక్షణ కరువైందని, అందుకు మణిపూర్ ఘటనే సజీవ సాక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, నగ్న ప్రదర్శనలు అనేకం జరిగాయని విమర్శించారు.
ఎప్పుడైతే రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ప్రారంభించారో అప్పటినుండి దేశ ప్రజల్లో మనోధర్యం వచ్చిందన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ యాత్రను చూసి బీజేపి భయపడి మళ్లీ ఈడి, సీబీఐ కేసులంటూ హైడ్రామా సృష్టిస్తున్నారని, వారెన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసిన రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మందుల అవిలయ్య, కొమారి మల్లయ్య, ఇటిక్యాల చిరంజీవి, సిద్ది రాము, జీడి వెంకన్న, మాతంగి నవీన్ తదితరులు పాల్గొన్నారు.