calender_icon.png 13 February, 2025 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలి

10-02-2025 10:33:39 PM

ఆర్డీవో శ్రీనివాసరావు...

మంచిర్యాల (విజయక్రాంతి): క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 14 నుంచి 16 వరకు జరుగనున్న గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో జాతర నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆడియో మాట్లాడారు. మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం, త్రాగునీరు, రోడ్ల మరమ్మత్తు చర్యలు నిర్వహించాలని, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు భోజన ఏర్పాట్లు చేయాలని, అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనతో పాటు మున్సిపల్ శాఖ సమన్వయంతో పార్కింగ్ నిర్వహణ చేయాలని తెలిపారు.

వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని నియమించాలని, అత్యవసర వైద్య సేవల నిమిత్తం అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని, అటవీ ప్రాంతం అయినందున యాంటీ వెనం ఇంజక్షన్ లు అందుబాటులో ఉంచాలని, సిపిఆర్ బృందం ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణపై పోలీసు శాఖ అధికారులు పర్యవేక్షించాలని, ప్రముఖుల సందర్శనకు అనుగుణంగా తగు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆదివాసీ సంఘాల నాయకులు, జాతర కమిటీ ప్రతినిధులు అధికార యంత్రాంగానికి సహకరిస్తూ జాతర ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగే విధంగా సహకరించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో బెల్లంపల్లి ఎసిపి రవి కుమార్, మందమర్రి తహశిల్దార్ సతీష్ కుమార్, క్యాతనపల్లి మున్సిపల్ కమీషనర్ రాజు, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి భగవాన్ రెడ్డి, ఆదివాసీ సంఘ నాయకులు, జాతర కమిటీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.