calender_icon.png 24 January, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు

02-09-2024 03:22:28 PM

మండపాల వద్ద అసాంఘిక కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు

డీజే లకు, పెద్ద స్పీకర్లకు అనుమతులు లేవు

హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్

హుజురాబాద్,(విజయక్రాంతి): ఈనెల 7న జరగనున్న గణపతి నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంతో జరుపుకోవాలని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ అన్నారు. సోమవారం డివిజన్ స్థాయిలోని అన్ని శాఖల అధికారులతో హుజరాబాద్ లోని సిటీ సెంట్రల్ లో జరిగిన గణపతి నవరాత్రోత్సవ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హుజురాబాద్ డివిజన్ మొత్తం గతంలో కంటే ఈ ఏడాది 50కి పైగా అధికంగా వినాయక ప్రతిమలతో పూజలు నిర్వహించే అవకాశం ఉందని మొత్తంగా 950 నుంచి 1000 మధ్యలో ఉంటాయన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే కమిటీ సభ్యులు మండపాల వద్ద చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

అలాగే మండపాల వద్ద ఏర్పాటు చేసే లైట్లకు సంబంధించి విద్యుత్ తీగలు సరిగా ఉండేలా చూసుకోవాలని, వర్షాకాలం కావడంతో ముఖ్యంగా విద్యుత్ విషయంలో సంబంధిత అధికారులతో  ఎప్పటికప్పుడు సలహాలు తీసుకుంటూ జాగ్రత్తగా విద్యుత్ సరఫరా చూసుకోవాలన్నారు. ప్రతి మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు రాత్రి సమయంలో ఇద్దరు ముగ్గురు నిర్వాహకులు ఉండాలని అన్నారు. ఎవరు లేనట్లయితే అర్ధరాత్రి వేళ ఏమైనా జంతువులు వచ్చి లడ్డూను, సామాగ్రిని పాడు చేసే అవకాశం ఉంటుందన్నారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మరాదని, ఏదైనా సమస్య ఉన్న లేక సమాచారం కావాలన్నా వెంటనే పోలీస్ అధికారులను సంప్రదించాలన్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వాట్సాప్ లో గ్రూపు ఏర్పాటు చేయనున్నామని, అందులో నిర్వాహకులతో పాటు అన్ని విభాగాల అధికారులు ఉంటారని ఏ సమస్య ఉన్న అందులో సమాచారం ఇస్తే వెంటనే అధికారులు స్పందించి ఆ సమస్యను పరిష్కరిస్తారని అన్నారు.

నవరాత్రి ఉత్సవాల్లో మండపాల వద్ద ఉండే యువకులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జనం సందర్భంగా పోలీసు అధికారుల సూచనల మేరకు నిమజ్జనం చేయాలని, డీజే లకు పెద్ద స్పీకర్లకు ఎట్టి పరిస్థితిలో అనుమతి ఉండదని గుర్తుంచుకోవాలన్నారు. డీజే లు పెడితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్ బాబు, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ చందులాల్, ఎమ్మార్వోలు కనకయ్య, రమేష్ బాబు, రాణి, లక్ష్మణ్, మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, ఆయాజ్, ఎలక్ట్రిసిటీ ఏ.డి శ్రీనివాస్ ఏ.ఈలు శ్రీనివాస్ గౌడ్, వీరాచారి, హుజురాబాద్ టౌన్ సిఐ  తిరుమల్ గౌడ్, రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట టౌన్ సిఐ వరగంటి రవి, రూరల్ సీఐ కిషోర్, ఎస్సైలు యూనస్ అహ్మద్ అలీ, ఆరోగ్యం, రవి తోపాటు వివిధ విభాగాల అధికారులతో పాటు గణేష్ మంటపాల నిర్వాహకులు పాల్గొన్నారు.