calender_icon.png 10 October, 2024 | 12:52 AM

గణపతిరెడ్డి రాజీనామా

04-09-2024 12:56:34 AM

  1. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణ వ్యయ అంచనాల పెంపుపై సీఎం గుర్రు
  2. అప్పటికప్పుడే విజిలెన్స్ విచారణకు ఆదేశం
  3. ఈఎన్‌సీగా ఆయన హయాంలో జరిగిన అన్ని పనులపై సమీక్షించే అవకాశం
  4. 2017 నుంచి ఎక్స్‌టెన్స్‌న్‌పై కొనసాగింపు

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): రోడ్లు భవనాల శాఖ (ఎన్‌హెచ్, బిల్డింగ్స్) ఈఎన్‌సీ గణపతిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గత నెల 27 నుంచి 31 మధ్య సెలవులో ఉన్న ఆయన.. విధులకు హాజరవుతారా? లేదా? అన్న ఆ శాఖ ఉద్యోగుల సందేహాలకు తెరదించుతూ రాజీనామా చేయడం గమనార్హం. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్ టిమ్స్ హాస్పిటళ్ల నిర్మాణాలకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని భావించిన సీఎం రేవంత్‌రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

ఈ రెండు పనులు గణపతి రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతున్నందున సీఎం ఆయనపై గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే గణపతిరెడ్డి తన రాజీనామా లేఖను ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్‌కు అందజేశారని ఆర్‌అండ్‌బీ వర్గాలు వెల్లడించాయి. 2017లో పదవీ విరమణ పొందిన గణపతిరెడ్డి.. ఏడేళ్లుగా ఎక్స్‌టెన్షన్‌లో కొనసాగారు. రేవంత్ సర్కార్ సైతం 9 నెలలుగా అదే పదవిలో కొనసాగించింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా భావిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ బాధ్యతలు చూస్తున్న గణపతిరెడ్డి హైవే నంబర్ కేటాయింపుల్లోనూ కీలకంగా వ్యవహరించారని సమాచారం.

గణపతిరెడ్డి ఆధ్వర్యంలోనే కొత్త సెక్రటేరియట్, ప్రగతిభవన్, పోలీస్ కమాండ్ కంట్రో ల్ సెంటర్, జిల్లా కలెక్టరేట్లు, అమర జ్యోతి, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, మెడికల్ కాలేజీలు, పలు జాతీయ రహదారుల నిర్మాణాలు జరిగాయి. నిర్మాణ దశలో ఉన్న వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్ లో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్స్ అంచనాల పెంపుపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న వేళ ఆయన రాజీనామా చర్చనీయాంశంగా మారింది. గణపతిరెడ్డి ఈఎన్‌సీగా చేసిన హయాంలో జరిగిన పనులన్నింటిపైనా సమీక్షించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

అసలేం జరిగిందంటే..

ఈనెల 27న వైద్యారోగ్య శాఖ అధికారులతో రాష్ట్రంలోని దవాఖానలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరంగల్ హెల్త్ సిటీ, సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ ఆసుపత్రుల అంచనాలను ఊహించని విధంగా పెంచిన తీరుపై సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌లో 24 అంతస్తుల్లో రూ.1,100 కోట్లతో పనులు చేపట్టి ఏకంగా రూ.1726 కోట్లకు అంచనాలు పెంచడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అలాగే హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న మూడు టిమ్స్ ఆసుపత్రుల అంచనాలను సైతం భారీగా పెంచేశారు.

మూడు టిమ్స్ పనులను రూ.2,679 కోట్లతో ప్రారంభించగా, వాటిని ఏకంగా రూ.3,562 కోట్లకు పెంచారు. వరంగల్ హెల్త్ సిటీ రూ.626 కోట్లు, టిమ్స్ రూ.883 కోట్లు కలిపి రూ. 1,509 కోట్లను పేపర్లపైనే అంచనాలు పెంచేసినట్టు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీనితోపాటు రాష్ట్రంలో నిర్మించిన కొత్త మెడికల్ కళాశాలలు, సమీకృత కలెక్టరేట్ల పనుల అంచనాలను సైతం అదే రీతిలో పెంచినట్టు సీఎం దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మొత్తం వ్యవహారంపై పూర్తి నివేదికతో పాటు విజిలెన్స్ విచారణ కోసం సీఎం ఆదేశించినట్టు సమాచారం. ఈ తరుణంలోనే సెలవులో ఉన్న గణపతి రెడ్డి రాజీనామా చేయడం ఆర్‌అండ్‌బీలో చర్చ నీయాంశంగా మారింది.