హీరో రామ్‌చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 2025, జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. నవంబర్ 9న లక్నోలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారు. గేమ్ చేంజర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తున్నాయి.
ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు దిల్‌రాజు, ఆదిత్యరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. “నా 21 ఏళ్ల ప్రయాణంలో నిర్మాతగా ‘గేమ్ చేంజర్’ నా 50వ సినిమా. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. మూడేళ్ల క్రితం శంకర్ ఈ సినిమా స్టోరీ లైన్ నాకు చెప్పగానే ఎగ్జయిట్ అయ్యా. ఆదిత్యరామ్ నాకు మంచి స్నేహితుడు.
ఆయన ఇదివరకే తెలుగు సినిమాలను నిర్మించారు. ఇటీవల కలిసినప్పుడు నేను గేమ్‌చేంజర్ మూవీని చేస్తున్నానని చెప్పగా, ఆదిత్యరామ్ ఇన్‌స్పైర్ అయ్యి ఇద్దరం కలిసి చేద్దామని నిర్ణయించుకున్నాం. ఈ ట్రావెల్ కంటిన్యూ అవుతుంది. మరికొన్ని తమిళ, పాన్ ఇండియా సినిమాలను నిర్మించటానికి మేం ప్లాన్ చేస్తున్నాం.
‘వారిసు’ తర్వాత నేను తమిళంలో ఇంకా సినిమాలు చేయాలనుకుంటున్నా. నవంబర్ 9న గేమ్ చేంజర్ టీజర్‌ను లక్నోలో విడుదల చేయబోతున్నాం. తర్వాత యూఎస్‌లో ఓ భారీ ఈవెంట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. తర్వాత చెన్నైలో ఓ ఈవెంట్ చేస్తున్నాం. జనవరి తొలి వారంలో ఏపీ, తెలంగాణల్లో ఈవెంట్స్ నిర్వహిస్తాం. జనవరి 10న సంక్రాంతి స్పెషల్‌గా గేమ్ చేంజర్ సినిమాను రిలీజ్ చేస్తాం. శంకర్ సినిమాలంటేనే స్పెషల్. సాంగ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్, సామాజిక సందేశం సినిమాలో ఉంటుంది. అవన్నీ ‘గేమ్‌చేంజర్’లో ఉంటాయి” అన్నారు.