calender_icon.png 19 April, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గేమ్‌చేంజర్.. గ్రీన్ ఎనర్జీ పాలసీ

17-04-2025 02:07:16 AM

  1. తెలంగాణకు భారీగా పెట్టుబడులు
  2. డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
  3. ‘టీజీ రెడ్కో’తో ఎకోరేస్ ఎనర్జీ ఇండియా, జీపీఆర్‌ఎస్ ఆర్య కంపెనీల ఎంఓయూ
  4. రూ.29 వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధం

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ న్యూఎనర్జీ పాలసీకి ఆకర్షితులై జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముం దుకు వస్తున్నాయని, దీంతో పాలసీ గేమ్ చేంజర్‌గా నిలుస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.

టీజీ రెడ్కో’ తో ఎకోరేస్ ఎనర్జీ ఇండియా, జీపీఆర్‌ఎస్ ఆర్య కంపెనీలు బుధవారం హైదరాబాద్‌లోని రాజేందర్‌నగర్ తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ సంస్థలో -ఎంఓయూ చేసుకున్నాయి. ఆయా కంపెనీలు రాష్ట్రంలో రూ.29 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయి. ఈ సందర్భంగా రెడ్కో, కంపెనీల ప్రతినిధులు డిప్యూటీ సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు దావోస్ పర్యటనలో సన్ పెట్రో కంపెనీ 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తు ఉత్పత్తికి రూ.20 వేల కోట్ల పెట్టుబడులు, అలాగే మెగా కంపెనీ 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి రూ.7,500 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారని గుర్తుచేశారు.

ఆ రెండు కంపెనీల ప్రాజెక్ట్‌లకు సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే సిద్ధమైందని, ఆయా కంపెనీలు త్వరలో కొత్త ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తాయని స్పష్టం చేశారు. 2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని వెల్లడించారు.

నిరంతరాయంగా విద్యుత్ సరఫరా..

2023లో అత్యధికంగా 15,623 మెగావాట్ల విద్యుత్ పీక్ డిమాండ్ రాగా, ఈ ఏడాది మార్చి 20న 17,162 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ వచ్చిందని, అయినప్పటికీ విద్యుత్‌శాఖ పక్కా వ్యూహంతో వినియోగదారుల అవసరాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా విద్యుత్ సరఫరా చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు.

హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, ఆర్‌ఆర్‌ఆర్, మూసీ పునర్జీవం, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల కారణంగా భవిష్యత్తులో విద్యుత్ అవసరాలు పెరుగుతాయని కొన్ని సంస్థలు ఇప్పటికే నివేదికలు ఇచ్చాయని తెలిపారు.

ఆ నివేదికల ఆధారంగా 2029 నాటికి 24,215 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్, 2034 35 నాటికి 31, 809 మెగావాట్ల గరిష్ట డిమాండ్ పెరుగుతుందని అంచనాకు వచ్చామని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తికి బాటలు వేస్తున్నదని, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకీ ప్రాధాన్యమిస్తున్నదని స్పష్టం చేశారు.