calender_icon.png 23 October, 2024 | 2:14 AM

గంభీర్‌కే పట్టం

10-07-2024 12:25:12 AM

ముంబై: అంతా అనుకున్నదే అయింది. గత కొన్ని రోజులుగా భారత హెడ్ కోచ్ పదవి రేసులో ముందు వరసలో నిలిచిన గౌతమ్ గంభీర్‌కే బీసీసీఐ పట్టం కట్టింది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌తో కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో అతడి స్థానంలో గంభీర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించాడు. కాగా గంభీర్ రెండేళ్ల పాటు టీమిండియా హెడ్‌కోచ్‌గా సేవలందించనున్నాడు.

ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో టీమిండియా కోచ్‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆటగాడిగా టీ20 ప్రపంచకప్ (2007), వన్డే ప్రపంచకప్ (2011) గెలిచిన జట్లలో సభ్యుడైన గంభీర్ కోచ్‌గానూ టీమిండియాను కొత్త పుంతలు తొక్కిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవలే ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా నిలవడంలో మెంటార్‌గా గంభీర్ పాత్ర కీలకమన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు కోచ్‌గా కొనసాగనున్న గంభీర్ ముందు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2026లో టీ20 ప్రపంచకప్ రూపంలో సవాళ్లు ఎదురు కానున్నాయి.