ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడమే కారణం అంటూ లేఖ
న్యూఢిల్లీ, నవంబర్ 17: మూడు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కీలక తరుణంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ పార్టీ సభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన ఆదివారం రాజీనామాను ఢిల్లీ సీఎం ఆతిషీకి సమర్పించగా.. సీఎం దానిని ఆమోదించారు. ఈ సందర్భంగా గహ్లోత్ ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు తన రాజీనామాకు దారితీసిన కారణాల గురించి ఓ లేఖ రాశారు.
అమలుకు నోచుకోని వాగ్దానాలు, ఇటీవల తలెత్తిన వివాదాలు వంటివి తన రాజీనామాకు కారణాలుగా లేఖలో గహ్లోత్ పేర్కొ న్నారు. యమునా నది ప్రక్షాళన చేస్తామన్న ఆప్ ఆ పని చేయలేకపోయిందని, దీనికి తోడు గతంలో ఎన్నడూ చూడనంత కాలుష్యంలో యమునా నది కూరుకుపోయిందని ఆయన విమర్శించారు.
ఆప్, బీజేపీ పరస్పర విమర్శలు..
ఢిల్లీ మంత్రి గహ్లోత్ రాజీనామాపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. బీజేపీ ఒత్తిడి వల్లే గహ్లోత్ రాజీనామా చేశారని ఆరోపించారు. ఆయనను సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలు టార్గెట్ చేశాయని.. ఈ నేపథ్యంలో వాటినుంచి రక్షణ పొందేందుకే రాజీనామ పేరుతో గహ్లోత్ బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదివారని విమర్శించారు.