calender_icon.png 20 January, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్గలయ్య గుట్టపై గగ్గలయ్య గది

20-01-2025 12:00:00 AM

  1. నాటి సైనిక స్థావరం, ఖైదీల బందీఖానా?
  2. వెలుగులోకి తెచ్చిన చరిత్ర పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి

జనగామ, జనవరి 19 (విజయక్రాంతి): వరంగల్ భద్రకాళి చెరువును ఆనుకుని ఉన్న అగ్గలయ్య, భద్రకాళి, భైరవ, పద్మాక్షి గుట్టల కింద ఓ రహస్య గదిని చరిత్ర పరిశోధకుడు, డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్‌రెడ్డి వెలుగులోకి తెచ్చారు. ఆ గది చారిత్రక విషయాలపై ఆయన పరిశోధించారు.

భద్రకాళి చెరువు మత్తడిపై హనుమద్గిరి తటాకాంజనేయ స్వా మి ఆలయ ఎదురుగా పక్కపక్కనే ఉన్న రెండు శిలల మధ్య నుంచి చెరువు మత్తడి వైపునకు వెళ్లే మార్గం ఉంది. ఈ శిఖరాగ్రంలో 10వ శతాబ్దం నాటి తూర్పు, ఉత్తర ముఖం గా చెక్కిన రెండు వినాయక శిల్పాలు ఉన్నా యి.

అగ్గలయ్య, భైరవ గుట్టల మధ్య నుంచి వెళ్లే దారి చివరకు చెరువుకు ఆనుకుని శిథిల దేవాలయ ఆనవాళ్లు, పడి ఉన్న శివలింగం, ఆలయ స్తంభాలు కనిపిస్తున్నాయి. 

రహస్య గగ్గలయ్య గది

భద్రకాళి చెరువుకు అభిముఖంగా సమీపంలో ఉన్న భైరవ శిల్పం మీదుగా 20 అడుగుల ఎత్తులో ఓ నిర్మాణం ఉంది. ఒక పడగ రాయి కింద, తొలిచిన భారీ శిలలతో శత్రు దుర్భేద్యమైన నిర్మాణం ఉంది. ఒక్కో శిల కొన్ని టన్నుల బరువుతో ఉండి కదిలించడం, నిలబెట్టడానికి అసాధ్యంగా ఉన్నా యి. ముఖద్వారంగా ఉన్న శిలలు పడిపోగా లోపల ప్రస్తుతం రెండు గదులు కనిపిస్తున్నాయి.

ఒక గది నుంచి మరో గదిలోకి వెళ్లేందుకు, గది వెనుక వైపు వెళ్లడానికి రెండు అ డుగుల వెడల్పు, మూడు అడుగుల ఎత్తులో చాలా ఇరుకైన రాతి ద్వారాలు ఉన్నాయి. గది వెనుక ఒక రోలు ఉంది. లోపల ఎలాం టి విగ్రహాలు, దేవాలయ ఛాయలు లేవు. వెలుతురు వచ్చే మార్గం లేదు. ముందు గదిలో ఒక మూల దిగువన చిన్న రంధ్రం ఉంది.

ఈ రంధ్రం వెలుపలి వైపు, గది పైభాగంలో ఎరువు రంగుతో వేసిన ఓ చిత్రం అస్పష్టంగా కనిపిస్తోంది. స్థానికులు దీనిని గగ్గలయ్య గదిగా చెబుతున్నారు. దీనిని సైనిక స్థావరం, ఆయుధ కర్మాగారం, లేదా యుద్ధ ఖైదీల బంధీఖానాగా వినియోగించినట్లుగా తెలుస్తోంది. ఈ గది కింద భైరవ శిల్పం ఉంది.

ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి ఈ గది తెలియకపోవడం గమనార్హం. భైరవ, అగ్గలయ్య గుట్టలను కలుపుతూ 30 అడుగుల ఎత్తులో చెరువు కట్ట ఉంది. కట్ట చిరవలో భైరవగుట్టకు అనుకొని ఎత్తు తక్కువగా ఉన్న పడగ రాయి కింద ఇటుకలతో నిర్మించిన మరో గది ఉంది.

పురావస్తు శాఖ పరిశోధించాలి : రెడ్డి రత్నాకర్‌రెడ్డి

కట్ట దిగువన అడుగు భాగంలో నిరంతరంగా భద్రకాళి చెరువు నుంచి బయటకు వచ్చే భూగర్భ జల రవాణా జరగడానికి రాతి నిర్మాణం ఉంది. ఈ నిర్మాణాన్ని మరమ్మతు చేయాల్సి ఉంది. చెరువు కట్ట తెగిపోకుండా ఉండడానికి, కట్ట దిగువన నీటి ఒత్తిడిని తగ్గించడానికి పొడవాటి తొలచిన శిలలను వరుసగా పాతిపెట్టారు. పురవాస్తు శాఖ పరిశోధిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయి.